Telangana: తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. వారికి రూ.లక్ష రుణ మాఫీ..
నేతన్నల జీవితాల్లో సంక్రాంతి వెలుగులు విరజిమ్మాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా సతమతమవుతున్న చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పింది. ఏకంగా లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. ఈ రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది? అనేది తెలుసుకుందాం..

తెలంగాణలోని చేనేత కార్మికుల జీవితాల్లో సంక్రాంతి వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్నలు తీసుకున్న రూ.లక్ష వరకు వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తున్నట్లు హ్యాండ్లూమ్, టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు. అప్పుల భారం నుంచి కార్మికులను విముక్తం చేసి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.
వేల మంది నేతన్నలకు అండగా ప్రభుత్వం
ఈ రుణమాఫీ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,784 మంది చేనేత కార్మికులు నేరుగా లబ్ధి పొందనున్నారు. 2017 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న రుణాల కోసం ప్రభుత్వం రూ. 27.14 కోట్లను మంజూరు చేసింది. దీనివల్ల గత కొన్నేళ్లుగా అప్పుల ఊబిలో ఉన్న నేతన్నలకు పెద్ద ఊరట లభించినట్లయింది.
ఆర్థిక భరోసాకు పెద్దపీట
కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. నేతన్నల భవిష్యత్తు అవసరాల కోసం అమలు చేస్తున్న చేనేత భరోసా, పొదుపు పథకాలకు ప్రభుత్వం ఏకంగా రూ. 303 కోట్లను కేటాయించింది. తీసుకున్న రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు పావలా వడ్డీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఇందిరమ్మ చీరల పథకం వంటి కార్యక్రమాల ద్వారా నిరంతర పని కల్పిస్తోంది.
టెస్కో ద్వారా భారీ కొనుగోళ్లు
చేనేత కార్మికులకు మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టెస్కో ద్వారా ప్రభుత్వం నేరుగా వస్త్రాలను కొనుగోలు చేస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.587 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కార్మికులకు నేరుగా ఆదాయం అందేలా ప్రభుత్వం అడుగడుగునా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా చేనేత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నేతన్నల సంక్షేమమే తమ ప్రాధాన్యతని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
