Governor Tamilisai: వ్యక్తిగతంగా కించపరిస్తే భరిస్తాను.. గవర్నర్ వ్యవస్థను అవమానిస్తే సహించలేంః గవర్నర్ తమిళసై

గణతంత్ర వేడుకలకు, ఉగాది వేడుకలకు ఎందుకు రాలేదు..ఇదేనా మర్యాద? సీఎం సహా అందరినీ ఆహ్వానించానని గవర్నర్ స్పష్టం చేశారు.

Governor Tamilisai: వ్యక్తిగతంగా కించపరిస్తే భరిస్తాను.. గవర్నర్ వ్యవస్థను అవమానిస్తే సహించలేంః గవర్నర్ తమిళసై
Governor Tamilisai
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 07, 2022 | 2:08 PM

Governor Tamilisai on Government: తెలంగాణ(Telangana) గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించడం లేదని.. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ మంచి పనుల్ని తాను అభినందించానని, పలు సూచనలు చేశానని చెప్పారు. గురువారం తెలంగాణ గవర్నర్‌ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగింది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. తెలంగాణలో ప్రస్తుత నెలకొని ఉన్న పరిస్థితులను అమిత్‌షాకు వివరించారు గవర్నర్‌. ఇందుకు సంబంధించి ఓ రిపోర్టును కూడా హోంమంత్రికి అందజేసినట్టు తెలుస్తోంది. అ సందర్భంగా ఆమె కామెంట్స్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

కేంద్ర మంత్రి అమిత్ షాతో గ‌వ‌ర్నర్ త‌మిళి సై సమావేశం సుదీర్ఘంగా సాగింది. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ పుదుచ్చేరి గురించి ఆయనతో చాలా అంశాలపై చర్చించాను.. ముఖ్యంగా తెలంగాణ ప‌రిస్థితుల‌ను వివ‌రించినట్లు గ‌వ‌ర్నర్ త‌మిళి సై తెలిపారు. ఎప్పుడూ నిర్మాణాత్మకంగా ఆలోచిస్తాను. తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తాను. నేను ఏది మాట్లాడినా ప్రజ‌ల కోస‌మే అన్నారు. ప్రజ‌ల‌కు మేలు జ‌రిగేలా హోం మంత్రితో చ‌ర్చించామ‌న్నారు. ఎవ‌రి స‌హ‌కారం అంద‌క‌పోయినా ముందుకు వెళ్తాన‌ని ఆమె తెలిపారు. మేడారం, భ‌ద్రాచ‌లం రోడ్డు మార్గంలోనే వెళ్లాన‌ని చెప్పారు. తెలంగాణ ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. తెలంగాణ‌లో ఏం జ‌రుగుతుందో తెలిసిందేన‌న్నారు. గ‌వ‌ర్నర్ ను ఎందుకు అవ‌మానిస్తున్నారో తెలంగాణ వాసులే తెలుసుకోవాలన్నారు గవర్నర్.

మేడారం వెళితే అధికారులు ఎందుకు రాలేద‌ని గ‌వ‌ర్నర్ ప్రశ్నించారు. తెలంగాణ గ‌వ‌ర్నర్ ప‌ర్యటించాలంటే రోడ్డు మార్గమే దిక్కని అన్నారు. శ్రీరామ‌న‌వ‌మి ఉత్సవాల‌కు భ‌ద్రాచ‌లం వెళ‌తాన‌ని చెప్పారు. యాదాద్రికి వెళితే ఒక్క అధికారి రాలేద‌న్నారు. రాజ్ భ‌వ‌న్, గ‌వ‌ర్నర్ ను కావాల‌నే అవ‌మానిస్తున్నార‌ని మండిపడ్డారు.“రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ, నన్ను బీజేపీ నేత అని ఎలా అనగల్గుతున్నారని ప్రశ్నించారు.అన్ని పార్టీల నేతలను కలిశాను. ఇంకా చెప్పాలంటే బీజేపీ నేతలను ఒకట్రెండుసార్లు మాత్రమే కలిశానన్నారు. ఏదన్నా ఉంటే నేరుగా అడగండి, నేను సమాధానం చెబుతాను. అలాగే సీఎస్, డీజీపీ, ఇతర అధికారులను వచ్చి వివరణ ఇవ్వమనండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర వేడుకలకు, ఉగాది వేడుకలకు ఎందుకు రాలేదు..ఇదేనా మర్యాద? సీఎం సహా అందరినీ ఆహ్వానించానని గవర్నర్ స్పష్టం చేశారు.