AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ గుడ్‌న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుకు డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..?

మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో సంక్షేమ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలును వేగవంతం చేసింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ గుడ్‌న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుకు డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..?
Telangana Indiramma Indlu Scheme
Venkatrao Lella
|

Updated on: Feb 18, 2026 | 8:57 AM

Share

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త అందించింది. త్వరలోనే కొత్త ఇళ్లను మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేసింది. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నట్లు తెలిపారు. నగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలోని అర్హులందరికీ ఇళ్లను త్వరలోనే ఇస్తామన్నారు. ఈ మేరకు లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. హైదరాబాద్ పరిధిలో సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి ఇళ్లను మంజూరు చేస్తామని, ఈ నెలాఖరులోనే విడుదల చేస్తామని ప్రకటించారు.

ఈ నెలాఖరులోగా ఇళ్ల మంజూరు

హైదరాబాద్‌లోని ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలోని ప్రజలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఇక నగరంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం తిరిగి చేపడతామని, వాటిని వీలైనంత త్వరగా లబ్దిదారులకు అందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల నిర్మాణాలకు స్థలాల సేకరణ ప్రక్రియపై కూడా అధికారులతో చర్చించారు. అటు హైదరాబాద్‌లోని లబ్దిదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే 5 నుంచి 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించనున్నారు. సిటీకి దూరంగా ఇస్తే వారి జీవనోపాధికి దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

28 వేల మందికి పత్రాలు జారీ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థలాలు ఉన్నవారికి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు పొంగులేటి తెలిపారు. దాదాపు 28 వేల మందికి వీటిని అందించనున్నట్లు చెప్పారు. ఇక నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయి ఇప్పుడు మళ్లీ మొదలుపెడితే హౌసింగ్ కార్పొరేషన్ సాయం చేస్తుందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నగరంలో ఎంతమంది లబ్దిదారులు ఉన్నారు.. స్థలాలు గుర్తించి ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చు అనే దానిపై వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అర్హులైన ప్రతీఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు కేటాయిస్తామన్నారు. ప్రతీఒక్కరూ లబ్ది పొందాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Follow Us