AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు.. ఎంత తింటే అంత బలం..

రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన సంప్రదాయ వంటకం వట్టి తునకల కూర. మేక మాంసాన్ని ఉప్పు, పసుపుతో కలిపి ఎండబెట్టి తయారు చేసే ఈ ఎండుమాంసాన్ని అవసరమైనప్పుడు కూరగా వండుకునేవారు. ప్రొటీన్‌, విటమిన్‌ బి12 వంటి పోషకాలు లభించే ఈ వంటకం శరీరానికి బలాన్నిచ్చే ఆహారంగా పెద్దలు భావించేవారు.

నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు.. ఎంత తింటే అంత బలం..
Vatti Thunakalu Benefits
Shaik Madar Saheb
|

Updated on: Aug 12, 2026 | 6:38 PM

Share

శరీరానికి బలాన్నిచ్చే వట్టి తునకల కూర ఒక సంప్రదాయ తెలుగు వంటకం.. పూర్వ కాలంలో, ముఖ్యంగా బాలింతలకు శక్తిని అందించడానికి దీనిని ప్రత్యేకంగా తయారుచేసేవారు. ఈ వంటకం ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేకపోయినా.. 30-40 ఏళ్లు పైబడిన చాలామందికి సుపరిచితం. ఎండు మాంసం (వట్టి తనకలు) కేవలం రుచికరమైనది మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వట్టి తునకలు అంటే ఎండబెట్టిన మేక మాంసం (మటన్) ముక్కలు. మిగిలిపోయిన మాంసానికి ఉప్పు, పసుపు రాసి, దండలాగా గుచ్చి ఎండలో ఆరబెట్టేవారు. వారానికి పైగా ఎండిన ఈ మాంసం ముక్కలను భద్రపరుచుకొని, అవసరమైనప్పుడు టమాటా, దోసకాయ లేదా ఉల్లిగడ్డలతో కూర వండుకునేవారు.

వట్టి తునకలతో ఎన్నో ప్రయోజనాలు..

ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వట్టి తునకలు (ఎండబెట్టిన మటన్) హై-ప్రొటీన్ కలిగిన బలవర్ధకమైన సాంప్రదాయ ఆహారం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇంకా శరీర బలహీనతను తగ్గిస్తుంది. పెద్ద మొత్తంలో తినాల్సిన పనిలేదు.. 100 గ్రాములు వండుకుంటే కుటుంబం మొత్తానికి సరిపోతుంది.

ప్రొటీన్లు, విటమిన్లు, బీ12 సమృద్ధిగా ఉన్న వట్టి తునకల కూర బాలింతలకు పాలు పడటానికి, శరీరం గట్టిపడటానికి, ప్రసవానంతరం లేదా గాయాల తర్వాత.. ఇంకా జబ్బుల అనంతరం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. నెలలో కనీసం ఒకసారైనా ఈ కూరను తినడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. ఈ సంప్రదాయ వంటకం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.

వట్టి తునకల కూర తయారీకి కావలసినవి:

వట్టి తునకలు (ఎండబెట్టిన మాంసం ముక్కలు) – సుమారు 100-150 గ్రాములు

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం (మీ కారానికి తగ్గట్టు), ధనియాల పొడి, గరం మసాలా, నీరు, కొత్తిమీర – కొద్దిగా (గార్నిషింగ్ కోసం), టమాటా లేదా దోసకాయ.. మీరు చేసుకునే కర్రీకి తగినట్లు..

తయారీ విధానం:

ముందుగా వట్టి తునకలను నీటిలో, వీలైతే వేడి నీటిలో, అరగంట పాటు నానబెట్టండి.

స్టవ్ మీద కుక్కర్ పెట్టి, నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి.

తరువాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు – (టమాటాలు లేదా దోసకాయ) వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించండి. కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వండి.

ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి.

నానబెట్టిన వట్టి తునకలను వేసి, రెండు మూడు నిమిషాలు కలియబెడుతూ వేయించండి.

కుక్కర్ మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో రెండు విజిల్స్ రానివ్వండి.

మూత తీసి, మరోసారి కలిపి, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేయండి. మసాలాలు ముక్కలకు బాగా పట్టేలా మీడియం ఫ్లేమ్‌లో కలియబెట్టండి.

ఒక పెద్ద గ్లాసు నీరు పోసి, అంతా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టండి. మీడియం ఫ్లేమ్‌లో నాలుగు విజిల్స్ రానివ్వండి.

విజిల్స్ వచ్చాక, ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకకపోతే, మరికొన్ని నీళ్లు పోసి మరో రెండు విజిల్స్ రానివ్వండి.

చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి, గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించి సర్వ్ చేయండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us