AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాబోయే 6 నెలలు యమ డేంజర్.. సూపర్ ఎల్‌నినోతో లక్షల మంది ప్రాణాలకు ముప్పు!

బలమైన ఎల్‌నినో కారణంగా రాబోయే 6 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. భారత్‌లో 15,800 మరణాలు అంచనా. అధిక ఉష్ణోగ్రతలు బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, శీతలీకరణ కేంద్రాలు, ఆరోగ్య అవగాహన వంటి చర్యలతో ఈ మరణాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

రాబోయే 6 నెలలు యమ డేంజర్.. సూపర్ ఎల్‌నినోతో లక్షల మంది ప్రాణాలకు ముప్పు!
Super El Nino AlertImage Credit source: AI Image
Balaraju Goud
|

Updated on: Sep 23, 2026 | 1:13 PM

Share

వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచాన్ని మరింత వేడెక్కిస్తున్న వేళ.. బలమైన ఎల్‌నినో పరిస్థితులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో రాబోయే ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సాధారణ సంవత్సరంతో పోలిస్తే సుమారు 4.51 లక్షల అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అధ్యయనం అంచనా వేసింది. ఇందులో భారత్‌లో సుమారు 15,800 అదనపు వేడి సంబంధిత మరణాలు ఉండొచ్చని పేర్కొంది. ఇవి ఇప్పటికే నమోదైన మరణాలు కాకుండా.. ఉష్ణోగ్రతల అంచనాలు, గత మరణాల గణాంకాల ఆధారంగా రూపొందించినట్లు క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ పేర్కొంది.

1.2 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు

అధ్యయనం ప్రకారం సెప్టెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 మధ్య ప్రపంచ భూభాగ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే సగటున 1.2°C వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. సాధారణ సంవత్సరంతో పోలిస్తే అత్యంత వేడి రోజులు కూడా సుమారు 44 శాతం ఎక్కువగా ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. ఈ పరిస్థితులు భవిష్యత్తులో వాతావరణ మార్పుల కారణంగా ఎదురయ్యే అధిక ఉష్ణోగ్రతలకు ఒక ముందస్తు సంకేతంలా ఉండొచ్చని అధ్యయనం పేర్కొంది.

భారత్‌పై ప్రభావం ఎలా ఉండొచ్చు?

భారత్‌లో అంచనా వేసిన 15,800 అదనపు మరణాల్లో దాదాపు సగం డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్యే సంభవించే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది. ఆ తర్వాత భారత్‌లో వేసవి కాలం ప్రారంభమయ్యే కొద్దీ వేడి ప్రభావం కొనసాగవచ్చని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, ఇతర బలహీన వర్గాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎల్‌నినో అంటే ఏమిటి?

తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడాన్ని ఎల్‌నినోగా పిలుస్తారు. సాధారణంగా ఇది కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఒకసారి ఏర్పడి.. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, కరువు, వేడి పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య పవనాలు బలహీనపడటం కూడా ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత ఎల్‌నినో బలపడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం?

అధ్యయనం ప్రకారం ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో సుమారు 66,800 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉంది. ఇందులో నైజీరియాలోనే 31,400, సూడాన్‌లో 17,500, నైజర్‌లో 10,000, చాద్‌లో 8,000గా అంచనా వేశారు. దక్షిణ, ఆగ్నేయాసియాలోనూ గణనీయమైన ప్రభావం ఉంటుందని అంచనా. ఫిలిప్పీన్స్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌, కంబోడియాలో కలిపి 19,400, ఇండోనేషియాలో 19,300, బ్రెజిల్‌లో 13,300 అదనపు వేడి సంబంధిత మరణాలు ఉండొచ్చని అధ్యయనం పేర్కొంది.

ప్రాణాలను కాపాడేందుకు ముందస్తు చర్యలు

అయితే ఈ అంచనాలు తప్పనిసరిగా జరిగే మరణాల సంఖ్య కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. వేడి హెచ్చరిక వ్యవస్థలు, శీతలీకరణ కేంద్రాలు, తాగునీటి సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు రక్షణ, బలహీన వర్గాలకు ఆరోగ్య అవగాహన, ఆసుపత్రుల సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యల ద్వారా మరణాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అధ్యయనం సూచించింది.

క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు భవిష్యత్తులో వాతావరణ మార్పుల వల్ల సాధారణమయ్యే అధిక ఉష్ణోగ్రతలకు ఒక ముందస్తు సంకేతంలా పనిచేస్తున్నాయి. అందువల్ల తక్షణ అత్యవసర చర్యలతో పాటు దీర్ఘకాలికంగా వాతావరణ అనుకూలత, ఆరోగ్య వ్యవస్థలు, వేడి నుంచి రక్షణ కోసం పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచిస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us