ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి కెమికల్స్ ఫ్రీ టిప్స్
శుభ్రమైన, అందమైన ముఖాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ ముఖం కడుక్కోవడం చాలా అవసరం. రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుందని నమ్ముతారు. ఇందుకోసం చాలా మంది మార్కెట్లో లభించే ఫేస్‌వాష్‌లను ఉపయోగిస్తారు. కానీ, వాటిలో ఉండే రసాయనాల వల్ల దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంది. తప్పుడు ఫేస్‌వాష్‌ను ఉపయోగించడం వల్ల తరచుగా మొటిమలు, మచ్చలు, చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఇటువంటి పరిస్థితులలో కొన్ని ఇంటి చిట్కాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రోజు మనం ఇంట్లోనే సహజమైన ఫేస్‌వాష్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం... ఇందులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు. కాబట్టి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ భయం అసలే ఉండదు.

ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో లభించే రకరకాల ఫేస్‌వాష్‌లలో పారాబెన్లు, సల్ఫేట్లు వంటి రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి తాత్కాలికంగా ముఖాన్ని శుభ్రం చేసినప్పటికీ, దీర్ఘకాలంలో చర్మం సహజ తేమను దెబ్బతీసి పొడిబారేలా చేస్తాయి. దీనికి పరిష్కారంగా మన ఇంట్లోని వంటింట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో ఎటువంటి కెమికల్స్ లేని హోమ్‌మేడ్ ఫేస్‌వాష్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ వాష్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారి విధానం ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు:
– శనగ పిండి
– చందనం పొడి
– ముల్తానీ మిట్టి
– కస్తూరి పసుపు
– బియ్యపు పిండి
ఎలా తయారు చేయాలి?:
ఇంట్లో తయారుచేసుకునే ఈ ఫేస్ వాష్ తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక గిన్నెలో 2 టీస్పూన్ల శనగపిండి, 2 టీస్పూన్ల గంధపు పొడి, 1 టీస్పూన్ ముల్తానీ మట్టి, 1 టీస్పూన్ కస్తూరి పసుపు, 1 టీస్పూన్ బియ్యప్పిండి వేసి, బాగా కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి. ఉపయోగించడానికి ముందు ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ల ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. అందులో చర్మ తత్వాన్ని బట్టి పాలు లేదా పెరుగ, లేదంటే, రోజ్ వాటర్‌ను చేర్చి పేస్ట్‌లా తయారు చేయాలి. చివరగా తేనె లేదా కలబంద జెల్ కలిపితే సహజ సిద్ధమైన ఫేస్‌వాష్ సిద్ధమవుతుంది.
దీన్ని ఎలా ఉపయోగించాలి?:
ముఖాన్ని ముందుగా నీటితో కడిగేసుకోవాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో వృత్తాకారంలో 1-2 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి.
హోమ్‌మేడ్ ఫేస్‌వాష్ ప్రయోజనాలు:
ఈ సహజ ఫేస్ వాష్‌లో మీ చర్మాన్ని పూర్తిగా శుభ్రపరచడానికి సహాయపడే పదార్థాలు ఉన్నాయి. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది, టానింగ్ తొలగిపోతుంది. మీ ఛాయ మెరుగుపడుతుంది. ఈ ఫేస్ వాష్ ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం గుర్తుంచుకోండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నాచురల్ ఫేస్‌వాష్‌ను రోజూ వాడటం వల్ల మీ చర్మ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది.




