Eggs: గుడ్లు ఉడకబెట్టినప్పుడు నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు పెంకు ఈజీగా ఊడి వచ్చేస్తుంది..
ఉదయాన్నే హడావుడిగా కోడిగుడ్లు ఉడకబెడుతుంటే.. అవి చిట్లిపోయి తెల్లసొన అంతా బయటకు వచ్చేస్తుందా? లేదా ఉడికిన తర్వాత పెంకు తీస్తుంటే గుడ్డు సగం పెంకుకే అతుక్కుపోతుందా..? చాలామంది వంటగదిలో నిత్యం ఎదుర్కొనే ఈ చిరాకుకు చెక్ పెట్టే ఒక అద్భుతమైన కిచెన్ హ్యాక్ ఉంది. గుడ్లు ఉడికించే నీళ్లలో కేవలం అర చెంచా ఈ పదార్థం వేస్తే చాలు.. గుడ్లు అస్సలు పగలవు, పైగా పెంకు క్షణాల్లో ఊడి వచ్చేస్తుంది.

ఉదయం ఆరోగ్యకర్యమైన అల్పాహారం అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఎన్నో పోషకాలకు నిలయమైన వీటిని చాలామంది రోజూ తింటారు. అయితే ఉడికించేటప్పుడు గుడ్డు పెంకు పగిలి లోపలి తెల్లసొన బయటకు రావడం, లేదా పెంకు తీసేటప్పుడు గుడ్డు సొనతో పాటు అతుక్కుపోయి విరిగిపోవడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. ఈ చిక్కులను తప్పించడానికి వంటగదిలో సులభంగా లభించే నిమ్మరసం ఎంతో చక్కగా పనిచేస్తుంది. గుడ్లను వేడి నీటిలో ఉడికిస్తున్నప్పుడు లోపలి గాలి వేడెక్కి వ్యాకోచిస్తుంది. దాంతో పెంకుపై ఒత్తిడి పెరిగి పగుళ్లు వస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఉడికించే నీటిలో సుమారు అర స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ చిన్న చిట్కా వల్ల గుడ్లు పగలకుండా ఉడకడమే కాకుండా ఉడికిన తర్వాత పెంకును నిమిషాల వ్యవధిలో సులువుగా వలిచే వీలు కలుగుతుంది.
పెంకు పగలకుండా నిలిచే శాస్త్రీయ కారణం
నిమ్మరసంలో సహజంగా ఉండే ఆమ్ల గుణం నీటి స్థితిని మారుస్తుంది. గుడ్డు పెంకులో ఉండే కాల్షియం ఆమ్ల నీటితో చర్య జరిపి కొంతవరకు గట్టిపడుతుంది. అందువల్ల వేడికి పెంకు త్వరగా పగిలిపోదు. అలాగే లోపలి పొర, తెల్లసొన మధ్య పట్టు కొద్దిగా వదులవుతుంది. ఉడికిన వెంటనే గుడ్లను చన్నీళ్లలో వేస్తే పెంకు త్వరగా ఊడి వస్తుంది.
గుడ్డు రుచిలో తేడా వస్తుందా..?
నీటిలో నిమ్మరసం వేస్తే గుడ్లు పుల్లగా మారతాయేమోనని చాలామంది సందేహిస్తుంటారు. నిజానికి ఆ నిమ్మరసం బయటి పెంకు వరకే పరిమితమవుతుంది తప్ప, లోపలి భాగానికి చేరదు. కాబట్టి గుడ్డు సహజ రుచిలో ఎలాంటి మార్పు ఉండదు.
పాటించాల్సిన మరిన్ని ఉపయోగకరమైన విషయాలు
గది ఉష్ణోగ్రత: ఫ్రిజ్ నుంచి తీసిన గుడ్లను వెంటనే వేడి నీటిలో వేయకుండా కొద్దిసేపు బయట ఉంచి ఆ తర్వాతే ఉడికించాలి.
మంట నియంత్రణ: నీరు మరీ ఎక్కువ వేగంతో పొంగేలా కాకుండా మధ్యస్థ మంటపై ఉడికిస్తే పెంకుపై ఒత్తిడి తగ్గుతుంది.
చన్నీళ్లలో ముంచడం: ఉడికిన గుడ్లను వెంటనే చల్లటి నీటిలో వేయడం వల్ల పెంకు సులువుగా ఊడి వస్తుంది.
తాజా గుడ్లు: మరీ తాజాగా ఉన్న గుడ్ల కంటే రెండు మూడు రోజుల క్రితం తీసుకున్న గుడ్లకు పెంకు సులభంగా వస్తుంది.
ఉదయం హడావుడి సమయంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, గుడ్లు పగలకుండా చక్కగా ఉడుకుతాయి. పెంకు ఒలిచే శ్రమ కూడా తగ్గి సమయం ఆదా అవుతుంది.
