AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నీళ్లు పెట్టిస్తున్న సైనికుల గొప్ప మనసు.. సహచరుడి కుమార్తె పెళ్లికి తండ్రిలా నిలిచిన జవాన్లు!

తండ్రి అంటే కూతురికి కొండంత అండ. ముఖ్యంగా జీవితంలో అత్యంత ముఖ్యమైన పెళ్లి వేడుకలో తండ్రి పక్కన ఉండాలని ప్రతి కుమార్తె కోరుకుంటుంది. కానీ విధి ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. హవిల్దార్ పప్పల్ సింగ్ మరణంతో ఆయన కుమార్తె ప్రీతి తన పెళ్లి వేడుకలో తండ్రి ఆశీర్వాదానికి దూరమైంది. అయితే ఆ లోటును భర్తీ చేసేందుకు భారత సైన్యంలోని ఆయన సహచరులు ముందుకొచ్చారు.

కన్నీళ్లు పెట్టిస్తున్న సైనికుల గొప్ప మనసు.. సహచరుడి కుమార్తె పెళ్లికి తండ్రిలా నిలిచిన జవాన్లు!
Soldier Daughter Wedding
Balaraju Goud
|

Updated on: Nov 24, 2026 | 5:10 PM

Share

అల్వార్: తండ్రి అంటే కూతురికి కొండంత అండ. ముఖ్యంగా జీవితంలో అత్యంత ముఖ్యమైన పెళ్లి వేడుకలో తండ్రి పక్కన ఉండాలని ప్రతి కుమార్తె కోరుకుంటుంది. కానీ విధి ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. హవిల్దార్ పప్పల్ సింగ్ మరణంతో ఆయన కుమార్తె ప్రీతి తన పెళ్లి వేడుకలో తండ్రి ఆశీర్వాదానికి దూరమైంది. అయితే ఆ లోటును భర్తీ చేసేందుకు భారత సైన్యంలోని ఆయన సహచరులు ముందుకొచ్చారు. తండ్రి స్థానంలో నిలిచి పెళ్లి బాధ్యతలను నిర్వర్తించి, ఆ కుటుంబానికి అండగా నిలిచారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.

తండ్రి స్థానంలో నిలిచిన సైనికులు

హవిల్దార్ పప్పల్ సింగ్ భారత సైన్యంలోని 16వ జాట్ రెజిమెంట్‌లో పనిచేశారు. ఆయన మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ముఖ్యంగా కుమార్తె ప్రీతి వివాహం వంటి జీవితంలోని కీలక సందర్భంలో తండ్రి లేకపోవడం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది.

ఈ విషయం తెలుసుకున్న పప్పల్ సింగ్ సహచర సైనికులు, రెజిమెంట్ అధికారులు ప్రీతి పెళ్లికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే యూనిఫాంలో వివాహ వేడుకకు చేరుకున్న సైనికులు, సంప్రదాయం ప్రకారం వధువు తండ్రి నిర్వహించాల్సిన బాధ్యతలను స్వీకరించారు. ప్రీతికి ఆశీర్వాదాలు అందిస్తూ, ఆమెను తమ ఇంటి బిడ్డలా చూసుకున్నారు.

పెళ్లి ఖర్చుల కోసం రూ.1.61 లక్షల సాయం

కేవలం పెళ్లికి హాజరై బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, పప్పల్ సింగ్ కుటుంబానికి ఆర్థికంగానూ అండగా నిలిచారు. వివాహ ఖర్చుల నిమిత్తం రెజిమెంట్ తరఫున రూ.1.61 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అలాగే పప్పల్ సింగ్ భార్య అనితా దేవికి శాలువా కప్పి గౌరవంగా సత్కరించారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

వీడ్కోలు సమయంలో కన్నీటి పర్యంతం

ప్రీతి పెళ్లిలో అత్యంత భావోద్వేగ క్షణం వీడ్కోలు సమయంలో చోటుచేసుకుంది. తండ్రి ఉంటే తనను ఆశీర్వదిస్తూ సాగనంపేవారని గుర్తుచేసుకుని ప్రీతి భావోద్వేగానికి లోనైంది. అయితే తండ్రి సహచరులైన సైనికులు ఆమెకు ధైర్యం చెబుతూ, ఆశీర్వదించి అత్తవారింటికి సాగనంపారు. ఈ వివాహ వేడుకలో ప్రీతి తన కజిన్ పూజతో కలిసి ఒకే వేదికపై వివాహం చేసుకుంది.

సైనికుల బంధానికి నిదర్శనం

ఈ ఘటన భారత సైన్యంలో సహచరుల మధ్య ఉండే ఆత్మీయత, బాధ్యత, కుటుంబ బంధాలకు అద్దం పడుతోంది. విధి నిర్వహణలో కలిసి పనిచేసిన సహచరుడి కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకోవడం ద్వారా సైనికులు తమ అనుబంధం ఉద్యోగానికే పరిమితం కాదని చాటిచెప్పారు.

తండ్రి లేని లోటును ఎవరూ తీర్చలేకపోయినా, ఆయన సహచరులు చూపిన ప్రేమ, ఆప్యాయత ప్రీతి కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఒక సైనికుడు దేశం కోసం సేవలందించినా, ఆయన కుటుంబానికి సైన్యం ఎప్పటికీ అండగా ఉంటుందనే సందేశాన్ని ఈ ఘటన అందిస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us