HYD to Vijayawada: నేషనల్ హైవేపై ప్రమాదాలకు చెక్.. 17 బ్లాక్ స్పాట్స్ ఇవే..
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైవేపై 17 చోట్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించి.. వాటిని అదుపు చేసేందుకు తీసుకుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ అలర్ట్ అయ్యింది. హైవేపై ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రెండు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ గణపతిరెడ్డి, నేషనల్ హైవేస్ రీజినల్ ఆఫీసర్ రజాక్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్- విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను గుర్తించినట్లు మంత్రి కోమటిరెడ్డికి తెలిపారు అధికారులు.
చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట టౌన్‌లోని ఎస్వీ కాలేజ్, జనగాం క్రాస్ రోడ్, ఈనాడు జంక్షన్, దురాజ్ పల్లి జంక్షన్, మునగాల మండలం ముకుందాపురం, ఆకుపాముల, కోమరబండ, కటకొమ్ముగూడెం, మేళ్లచెరువు, శ్రీరంగాపురం, రామాపురం ఎక్స్ రోడ్, నవాబ్‌పేట జంక్షన్ ప్రాంతాల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు రహదారుల శాఖ వెల్లడించింది. అయితే.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలతో ప్రమాదాల నివారణకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఈ క్రమంలోనే.. సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్ని చోట్ల 6 లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్‌మెంట్స్, వెహిలకిల్ అండర్ పాస్‌ల నిర్మాణం, రెండు వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు.
వాస్తవానికి.. హైదరాబాద్- విజయవాడ హైవేపై చాలాకాలంగా బ్లాక్ స్పాట్స్ మరమ్మతుల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం 17 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించగా.. ఆయా ప్రాంతాల్లో పనులకు 326 కోట్ల వ్యయం అవుతుందని అధికారుల అంచనా వేశారు. మొత్తంగా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హైదరాబాద్- విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
