AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Secretariat: తెలంగాణ సచివాలయం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న టీఆర్‌ఎస్‌.. బీజేపీకి చెక్‌ పడేనా.?

Telangana: తెలంగాణ సచివాలయ విషయంలో టీఆర్‌ఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నూతంగా నిర్మిస్తున్న సచివాలయ భవనానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్‌. బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును నామకరణం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది....

Telangana Secretariat: తెలంగాణ సచివాలయం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న టీఆర్‌ఎస్‌.. బీజేపీకి చెక్‌ పడేనా.?
Telangana Secretariat
Narender Vaitla
|

Updated on: Sep 15, 2022 | 4:30 PM

Share

Telangana Secretariat: తెలంగాణ సచివాలయ విషయంలో టీఆర్‌ఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నూతంగా నిర్మిస్తున్న సచివాలయ భవనానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్‌. బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును నామకరణం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సచివాలయానికి అంబేద్కర్‌ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీచేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం గురువారం జీవో సైతం జారీ చేసింది. పాత సచివాలయాన్ని పూర్తిగా కూల్చేసి అధునాతన సౌకర్యాలతో కొత్త సచివాలాయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా నిర్మాణ పనులు జరుపుకుంటున్న తెలంగాణ సచివాలయం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ఈ విషయమై ఈ విషయమై కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి ఉన్నాయి.. డా. బిఆర్ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని అమలు చేస్తోంది’ అని చెప్పుకొచ్చారు.

ఇక అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరిట్‌కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదని… భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నామని తెలిపారు. ఇదే విషయమై నేను భారత ప్రధానికి త్వరలో స్వయంగా లేఖను పంపుతాన్న కేసీఆర్‌.. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును పెట్టాలని నీను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంతో బీజేపీని టార్గెట్‌ చేసిందా అన్ని వాదన తెరపైకి వస్తోంది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరుతూ తెలంగాణ శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానానికి ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా మద్ధతు పలికారు. అయితే ఈ విషయమై టీఆర్‌ఎస్‌పై బీజేపీ కౌంటర్‌ అటాక్‌ చేసింది. తెలంగాణలో నిర్మిస్తున్న సచివాలయ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని, ఆ తర్వాతే పార్లమెంట్ భవన్‌ పేరు మార్పు గురించి మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సచివాలయానికి అంబేడ్కర్‌ పేరును నామకరణం చేస్తూ జీవో జారీ చేయడంతో బీజేపీకి చెక్‌ పెట్టడానికే టీఆర్‌ఎస్‌ ఈ నిర్ణయం తీసుకుందా అన్న వాదనకు బలం చేకూరినట్లైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..