Ganesh Immersion: వినాయక విగ్రహాల నిమజ్జనంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్..
హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు నో చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Hyderabad Ganesh Immersion: హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు నో చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈమేరకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
హుస్సేన్ సాగర్‌లో వినాయకుల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ వ్యర్థాలతో పూర్తిగా కలుషితం అవుతుందని, ఇందులో గణేశ్, దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడానికి మాత్రం ధర్మాసనం అనుమతిచ్చింది.
అయితే, ట్యాంక్ బండ్ వైపు విగ్రహాల నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసిన హైకోర్టు.. పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వైపు నుంచి చేసుకోవచ్చని తెలిపింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసి .. అందులో నిమజ్జనం చేయాలని సూచించింది. వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించింది. ప్రతి ఏటా హైదరాబాద్ మహానగరంతోపాటు రాజధానికి చుట్టూ పక్కలా ఉన్న జిల్లాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, కోలాహలంగా విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయడం అనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మరోవైపు, రేపు తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. అటు హైకోర్టు తీర్పుని గౌరవిస్తూ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నామన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు మంత్రి తలసానిని కలిశారు.. సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష జరిపి తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు ను ఆశ్రయించడం జరిగిందన్నారు. తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని, సానుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు, శోభాయాత్ర ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.