Harish Rao: హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్ రావు
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రేపటి నుంచి ఆయా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నామని తెలంగాణ రెవెన్యూ మంత్రి హరీశ్ రావు
Harish Rao – Jammikunta: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రేపటి నుంచి ఆయా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నామని తెలంగాణ రెవెన్యూ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇవాళ కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మహిళా సంఘాల సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్త్రీ నిధి రుణాల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, జెడ్పీ ఛైర్ పర్సన్ విజయ, మాజీ మంత్రి పెద్ది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మహిళామణులకు పలు విషయాలు స్పష్టం చేశారు. “మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు మీ ఖాతాల్లో రేపటి నుంచి జమ చేస్తున్నాం. 2.34 కోట్ల వడ్డీలేని బ్యాంక్ లింకేజీ రుణాలు జమ్మికుంట మహిళ సంఘాలకు అందిస్తున్నాం. స్త్రీ నిధి పథకంలో వడ్డీలేని రుణం కింద కోటి 84 లక్షలు మీ ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇవి కాకుండా.. కొత్తగా 10 కోట్ల బ్యాంకు లింకేజీ, మరో కోటి రూపాయలు స్త్రీ నిధి కింద లోన్లు మంజూరు చేస్తున్నాం. తెలంగాణ వచ్చాక.. మహిళలకు 5 లక్షల పైన రుణాలు సకాలంలో అందిస్తున్నాం. మైక్రోఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల బెడద లేకుండా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. వడ్డీ లేని రుణం కింద రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసేందుకు బడ్జెట్ లో 3 వేల కోట్లు పెట్టాం. ప్రభుత్వం ఏ లబ్ధి అందించినా.. మహిళల పేర్లపైనే ఇస్తున్నాం.” అని మంత్రి పేర్కొన్నారు.
కళ్యాణలక్ష్మి పథకం మొదట్లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చామని అయితే, ఇప్పుడు అన్ని కులాల్లోని నిరుపేదలకు రూ. లక్షా 116 ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. “కళ్యాణ లక్ష్మి డబ్బులు అత్తవారికి చెందకుండా.. వధువు తల్లిపేరుతో ఇస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు.. మగపిల్లాడు పుడితే 12 వేలు, ఆడపిల్ల పుడితే 13 వేలతోపాటు, కేసీఆర్ కిట్టు అందిస్తున్నాం. టీడీపీ, బీజేపీ పొత్తుల ప్రభుత్వం నడిపినప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే భయపడేవారు. “నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు” అనే… పాటను నేడు.. “నేను పోతా సర్కారు దవాఖానకు” అనేలా మార్చాం. 57 ఏళ్లు నిండిన వాళ్లకు ఫించను ఇస్తామన్న హామీ కరోనా వల్ల ఆలశ్యమైంది. ఇచ్చిన మాట ప్రకారం 1-2 నెలల్లోనే అందరికీ ఇస్తాం. ఆసరా ఫించను పుణ్యామా అని కోడళ్లు అత్తలను బాగా చూసుకుంటున్నారు. అత్తలే .. కోడళ్లకు ఆసరాగా మారారు. తెలంగాణ రాకముందు కరెంటు, సాగునీటి పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందన్నది మీకు తెలుసు. వారం, పది రోజుల్లాగా.. 50 వేల వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేస్తున్నాం.” అని హరీశ్ చెప్పుకొచ్చారు.
“మార్చి తర్వాత లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ వడ్డీతో సహా మాఫీ చేస్తాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వాల్సి ఉంది. అవి కూడ గత మంత్రి ఈటెల నిర్లక్ష్యం వల్ల పూర్తి చేయలేదు. కేసీఆర్ రాష్ట్రం వస్తే జైత్ర యాత్ర, లేకపోతే నా శవ యాత్ర అని కేసీఆర్ ఉద్యమానికి బయలుల్దేరాడు. ఆలాంటి కేసీఆర్ సత్తా మీకందరికీ తెలుసు.. అనుకున్నవన్నీ చేస్తారు. గతంలో ఇక్కడ ఒక్క మహిళ భవనం లేదు. రూ.3కోట్లతో 20 గ్రామాల్లో 20 మహిళా భవనాలు మంజూరు చేశాం. త్వరలో మరో 50వేల ఉద్యోగాలు ప్రకటించ బోతున్నాం.” అని హరీశ్ రావు పేర్కొన్నారు.
Read also: Cabinet Meeting: అత్యవసరంగా భేటీ కాబోతోన్న తెలంగాణ క్యాబినెట్.. చీఫ్ సెక్రటరీ అర్జెంట్ నోట్