Cabinet Meeting: అత్యవసరంగా భేటీ కాబోతోన్న తెలంగాణ క్యాబినెట్.. చీఫ్ సెక్రటరీ అర్జెంట్ నోట్

తెలంగాణ క్యాబినెట్ అత్యవసరంగా భేటీ కాబోతోంది. ఎల్లుండి(16.09.2021) మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ మీటింగ్ ఉందంటూ

Cabinet Meeting: అత్యవసరంగా భేటీ కాబోతోన్న తెలంగాణ క్యాబినెట్.. చీఫ్ సెక్రటరీ అర్జెంట్ నోట్
Cabinet
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 14, 2021 | 3:59 PM

Telangana Cabinet Meeting: తెలంగాణ క్యాబినెట్ అత్యవసరంగా భేటీ కాబోతోంది. ఎల్లుండి(16.09.2021) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ బేగంపేటలోని ప్రగతి భవన్‌లో క్యాబినెట్ మీటింగ్ ఉందంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటన కొంచెం సేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు, దళిత బంధు, వరి సాగు పై ఎల్లుండి జరుగబోతోన్న క్యాబినెట్ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.

కాగా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిన్న రాత్రి.. మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంలో ప్రకటించారు. ప్రతి ఏటా 2 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేసేలా 20 వేల కోట్లను కేటాయిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. కొత్తగా నాలుగు మండలాల్లో దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలను గౌరవించి వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులకు అనుగుణంగా దళితబంధును విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెలంగాణ నలుదిక్కులా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

తూర్పు దిక్కున మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చం పేట – కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరుగబోతోన్న క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

ఇక, ప్రతి సంవత్సరం రెండు లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు వర్తింప చేయనున్నట్లు కేసీఆర్ నిన్నటి మీటింగ్‌లో తెలిపారు. అయితే.. వరుస క్రమంలో ఇతర కులాల్లోని పేదలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు అమలు చేసినప్పుడు దళితులు ఎవరు అభ్యంతరం చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత బంధు అమలు విషయంలో మిగతా వర్గాల వారు సహకరించాలని కేసీఆర్ తెలిపారు. దళిత బంధు పథకంలో డైరీ యూనిట్ కు ఎక్కువగా స్పందన వస్తున్నందున ఎస్సీ వెల్ఫేర్, పశుసంవర్ధక శాఖ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి. అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కొత్తగా అమలు చేసే నాలుగు మండలాలు ఉన్న జిల్లాల మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు సూచనలను తీసుకున్నారు.

Ts Cabinet

TS Cabinet Meeting

Read also: Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధి.. పరిరక్షణకు జీహెచ్ఎంసీలో ప్రత్యేక కమిషనర్: మంత్రి కేటీఆర్