Telangana: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. హుక్కాపై నిషేధం

తెలంగాణలో హుక్కా కేంద్రాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోగా.. తాజాగా అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Telangana: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. హుక్కాపై నిషేధం
Hookah Ban
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 12, 2024 | 11:39 AM

ఫిబ్రవరి 12:  తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హుక్కాపై నిషేధం విధించింది.  తెలంగాణలో హుక్కా కేంద్రాలను  నిషేదించే సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు బిల్లు ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు సభకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సిగరెట్ పొగ కంటే హుక్కా మరింత హానికరమని చెప్పారు. యువతకు హుక్కా వ్యసనమయ్యే అవకాశం ఉందన్నారు.

హుక్కా అనేది సిగరెట్లతో పోల్చితే వెయ్యి రెట్లు హానికరం. ఒక సిగరెట్‌తో పోల్చితే, ఒక హుక్కా సెషన్‌లో దాదాపు 125 రెట్లు పొగ, 25 రెట్లు తారు , 2.5 రెట్లు నికోటిన్, 10 రెట్లు కార్బన్ మోనాక్సైడ్‌ విడుదలవుతుంది. ఒక్కసారి హుక్కాకు అలవాటు అయితే.. యువత దానికి బానిసలవుతారు. ఈ పోకడ ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని యువత, ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్ హుక్కాను.. హుక్కా సెంటర్లను శాశ్వతంగా బ్యాన్ చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది.

హుక్కా నిషేధం బిల్లుపై సభలో ఎలాంటి చర్చ లేకుండానే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ బిల్లు రాకతో.. ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా సెంటర్లు క్లోజ్ అవ్వనున్నాయి. హుక్కా నిషేధం వెంటనే అమల్లోకి వస్తుంది. హుక్కాకు సంబంధించిన ఉత్పత్తులను కూడా అమ్మటం, కొనటం నేరంగా పరిగణించబడుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..