AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit shah tour: అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు.. బీజేపీ అగ్ర నేతల పర్యటనలతో ప్రచార హోరు

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు.. ఇప్పుడు రెండో దశ ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. శుక్రవారం సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు.

Amit shah tour:  అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు.. బీజేపీ అగ్ర నేతల పర్యటనలతో ప్రచార హోరు
Amit Shah
Balaraju Goud
|

Updated on: Oct 27, 2023 | 7:16 AM

Share

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు.. ఇప్పుడు రెండో దశ ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. శుక్రవారం సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు. అయితే.. ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌తో అసంతృప్తి గురైన నేతలతో అమిత్‌ షా మాట్లాడతారా లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచుతోంది. అధికార బీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది. దానిలో భాగంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్ర నేతల చరిష్మాను వాడుకొనేందుకు ప్లాన్‌ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీ కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. ఆయా పర్యటనల్లో తెలంగాణ ప్రజలకు పలు హామీలను ఇచ్చారు. బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాతోపాటు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం గుప్పించారు బీజేపీ అగ్రనేతలు.

ఇప్పుడు తెలంగాణలో మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. రాత్రికే హైదరాబాద్‌ చేరుకున్న అమిత్‌షా.. నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేశారు. దానిలో భాగంగా.. నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ ఐపీఎస్‌ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌‌లో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌లో సూర్యాపేటకు బయలుదేరనున్నారు అమిత్‌షా. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సూర్యాపేట బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభకు హాజరుకానున్నారు. సభ ముగింపు తర్వాత బేగంపేట్‌ చేరుకుని సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి అమిత్‌షా పయనం అవుతారు. అమిత్ షా పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ యంత్రాంగం.

ఇదిలావుంటే.. సూర్యాపేట పర్యటనలో భాగంగా.. తెలంగాణ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అయితే.. ఫస్ట్ లిస్ట్ అభ్యర్థుల ప్రకటన తర్వాత సూర్యాపేటలో బీజేపీ సభ జరుగుతోంది. ఈ క్రమంలో.. ఫస్ట్‌ లిస్ట్‌లో టిక్కెట్లు దక్కని కొందరు అలకబూనారు. బీజేపీ ఆశావహులు అసంతృప్తి గళమెత్తారు. అయితే.. అలాంటివారితో అమిత్‌ షా ఏమైనా చర్చలు జరుపుతారా? లేదా? అన్నది పార్టీ వర్గాల్లో సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తోంది. అలాగే.. ఇంతవరకూ మేనిఫెస్టోపై ఎలాంటి ప్రకటనలు చేయని నేపథ్యంలో.. సూర్యాపేట సభలో అమిత్ షా హామీలేమైనా ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..