Revanth Reddy Profile: టీపీసీసీ చీఫ్ టూ సీఎం.. రేవంత్ సంచలన రాజకీయ ప్రస్థానం ఇదే..

Revanth Reddy Telangana Election 2023: కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా, తెలంగాణ రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా రేవంత్ రెడ్డి కంటూ ప్రత్యేక స్థానం ఉంది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఈయనకు చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. డిగ్రీ చదివే సమయంలోనే రేవంత్ రెడ్డి.. అఖిల భారత విద్యార్ధి పరిషత్ నాయకుడిగా ఉన్నారు.

Revanth Reddy Profile: టీపీసీసీ చీఫ్ టూ సీఎం.. రేవంత్ సంచలన రాజకీయ ప్రస్థానం ఇదే..
Revanth Reddy
Follow us

|

Updated on: Dec 07, 2023 | 1:46 PM

Revanth Reddy Telangana Election 2023: మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్.. చెప్పే మాటైనా.. చేసేది ఏదైనా.. అదొక సంచలనం.. విమర్శలైనా, నిరసనలైనా తనదైన మార్క్‌తో రాజకీయ ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తారు. అనుచరులేమో ఈయన్ని ముద్దుగా టైగర్ అని పిలుచుకుంటుంటారు. 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో.. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పదునైన వ్యూహాలు రచించారు ఈ మాస్ లీడర్. ఇంతకీ ఎవరనుకుంటున్నారా.. మరెవరో కాదు ఎనుములు రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఈయనకు చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. డిగ్రీ చదివే సమయంలోనే రేవంత్ రెడ్డి.. అఖిల భారత విద్యార్ధి పరిషత్ నాయకుడిగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న రేవంత్ రెడ్డి.. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహమాడారు.

రాజకీయ జీవితం ఇలా..

1992 సంవత్సరంలోనే విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో రేవంత్ రెడ్డి.. అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్‌ నాయకుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన.. మొదటిలో టీడీపీ పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. 2001-02 మధ్యలో టీఆర్ఎస్‌(ప్రస్తుతం బీఆర్ఎస్)లో పని చేశారు. రేవంత్ తన రాజకీయ ప్రస్థానం ఆదిలోనే కొన్ని ఎత్తుపల్లాలను చూశారు. 2004లో కల్వకుర్తి టికెట్ వస్తుందని రేవంత్ ఆశించినా.. చివరికి ఆయనకు నిరాశే మిగిలింది. అలాగే 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ తనకు టికెట్ వస్తుందని భావించినా.. అది కూడా అందని ద్రాక్షే అయింది. ఇక 2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి.. అద్భుత విజయాన్ని అందుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పేరు విపరీతంగా మారుమ్రోగింది. 2008లో మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి చేరిన రేవంత్ రెడ్డి.. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై భారీ విజయం సాధించారు. ఆయన 2014లో కూడా మరోసారి గుర్నాథరెడ్డిని ఓడించి.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్‌రెడ్డి 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్నారు.

రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్‌లో టిడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆయన 2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికలు 2023లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. సుమారు 32 వేల ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. అలాగే అన్నీ తానై.. తన పార్టీ కాంగ్రెస్‌కు తెలంగాణలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 69 సీట్లలో గెలిచి.. మ్యాజిక్ ఫిగర్ దాటడమే కాకుండా..  భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఇక ఎన్నికలు ముగిసిన అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ పలు చర్చలు జరిపి.. రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో డిసెంబర్ 7న తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో కిక్కిరిసన జనసందోహం, అగ్రనేతల సమక్షంలో రేవంత్‌తో ప్రమాణం చేయించారు గవర్నర్‌ తమిళిసై. రేవంత్‌ ప్రమాణం స్వీకారం తర్వాత మరో 11 మంది మంత్రులు వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. వారితో గవర్నర్‌ తమిళిసై రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేయించారు.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..

Latest Articles