AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: తెలంగాణ బీజేపీలో కల్లోలం సృష్టిస్తున్న విజయశాంతి ట్వీట్

Telangana Elections: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తొలి జాబితా విడుదల చేసేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతోంది. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మేరకు విజయశాంతి చేసిన ట్వీట్ సోషల్ మీడయా వేదికగా దుమారమే రేపుతోంది.

Telangana BJP: తెలంగాణ బీజేపీలో కల్లోలం సృష్టిస్తున్న విజయశాంతి ట్వీట్
Vijayashanti
Balaraju Goud
| Edited By: |

Updated on: Oct 19, 2023 | 12:18 PM

Share

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తొలి జాబితా విడుదల చేసేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతోంది. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మేరకు విజయశాంతి చేసిన ట్వీట్ సోషల్ మీడియా వేదికగా దుమారమే రేపుతోంది.

గత కొంతకాలంగా బీజేపీలోనే ఉన్నప్పటికీ విజయశాంతి గెస్ట్ రోల్స్‌లోనే కనిపిస్తున్నారు. అధిష్టానం బాధ్యతలు అప్పగించినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారా లేదా అన్న సంగతి ఆమెకే తెలియాలి. అయితే అప్పుడ్పుపుడు తన సంచలన ట్వీట్లతో వార్తల్లోకి రావడం మాత్రం ఇటీవల సర్వ సాధారణమైపోయింది. ఈ సారి మరోసారి తనదైన స్టైల్లో ట్వీట్ చేసి వార్తల్లోకెక్కారు. ఓ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీకి తన పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధిష్టానానికి పరోక్షంగా చెప్పినట్టుంది ఆ ట్వీట్ సారాంశం. కేవలం తన సంగతి మాత్రమే చెప్పి ఊరుకోలేదు. ఈ రచ్చలోకి బండి సంజయ్‌ని కూడా లాగి పార్టీలో కొత్త చర్చకు తెరలేపారు.

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పటిలాగే గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు ఫ్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని విజయశాంతి బీజేపీ అధిష్టానానికి పరోక్షంగా విజ్ఞప్తి చేశారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గం నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేరును కూడా పరిశీలించాలంటూ పరోక్షంగా కోరారు. అయితే ఇది తన మాటలా కాకుండా.. సగటు తెలంగాణ బీజేపీ కార్యకర్త కోరుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ఉద్దేశం తనకు లేదని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన విజయశాంతి.. ట్వీట్లో మాత్రం అధిష్టానం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందన్నారు.

మరోవైపు ఇప్పటికే గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీకి తాను సిద్ధమంటూ గత కొద్ది రోజులుగా బీజేపీ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెబుతూ వస్తున్నారు. హుజురాబాద్‌ ఎన్నికల సమయంలో ప్రజలను కేసీఆర్ పెట్టిన ఇబ్బందులు చూసే గజ్వేల్‌లో పోటీ చేయాలని ఫిక్స్‌ అయ్యానన్నారు ఈటల. తాను గజ్వేల్‌కు వెళ్లకముందే.. వందలాది మంది నేతలు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. గజ్వేల్ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉన్నారో.. తామున్నామో వచ్చే నవంబర్ 30న తేలిపోతుందన్నారు. అభివృద్ధి, ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదని గజ్వేల్‌ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు ఈటల రాజేందర్‌. ఈ స్థాయిలో ఈటల గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఢీ కొట్టాలని మానసికంగా సిద్ధమై ఉండగా… అంతలోనే అక్కడ బండి పోటీ చెయ్యాలంటూ కార్యకర్తలు కోరుతున్నారని విజయశాంతి ట్వీట్ చెయ్యడం అటు పార్టీ కార్యకర్తలను, రాష్ట్ర అధినాయకత్వాన్ని కూడా ఆందోళనలో పడేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…