Telangana Election: ఒకే ఊరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు.. రాజకీయ ఉద్దండులను అందించిన అరుదైన గ్రామం
ఆ గ్రామం.. రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ గ్రామం ముగ్గురిని ఎమ్మెల్యేలుగా చట్ట సభలకు పంపింది. ఆ నేతలు నిత్యం సెన్సేషనల్ కామెంట్స్‌తో రాజకీయాలను ప్రభావితం చేస్తూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక నేతలుగా ముద్ర వేసుకున్నారు. ఇంతటి ఘనత వహించిన ఆ గ్రామం ఈ ఎన్నికల్లోనూ మరోసారి తన వారసత్వాన్ని చాటుతోంది.

ఆ గ్రామం.. రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ గ్రామం ముగ్గురిని ఎమ్మెల్యేలుగా చట్ట సభలకు పంపింది. ఆ నేతలు నిత్యం సెన్సేషనల్ కామెంట్స్‌తో రాజకీయాలను ప్రభావితం చేస్తూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక నేతలుగా ముద్ర వేసుకున్నారు. ఇంతటి ఘనత వహించిన ఆ గ్రామం ఈ ఎన్నికల్లోనూ మరోసారి తన వారసత్వాన్ని చాటుతోంది. ఆ గ్రామం ఎక్కడ ఉంది.. ఆ నేతలు ఎవరో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలకు ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ గ్రామానికి చెందిన వారే. ఈ గ్రామానికి చెందిన ముగ్గురు నేతలు 2009 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచి శాసనసభలో రాణిస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయ కార్యకలపాల్లో చురుగ్గా పాల్లొని అంచెలంచెలుగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. యువజన కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1999 నుంచి వరుసగా నాలుగుసార్లు నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వెంకట్ రెడ్డి. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో ప్రముఖులుగా ఎదిగారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గత తెలంగాణ శాసనసభలో ఆయన కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా గెలిచారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపాలైన రాజగోపాల్ రెడ్డి తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడులో పోటీ చేసి విజయం సాధించారు. 2022లో కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
ఇదే గ్రామానికి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు చిరుమర్తి లింగయ్య 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన చిరుమర్తి లింగయ్య 2018 లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ఈ ముగ్గురు నేతలను బ్రాహ్మణ వెల్లంల చట్టసభలకు పంపింది. జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తూ రాష్ట్ర జాతీయస్థాయి నేతలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ముద్ర వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన ఈ ముగ్గురు నేతలు మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ముగ్గురు రాజకీయ నేతలను అందించిన బ్రాహ్మణ వెల్లంల రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఒకే గ్రామం నుంచి ముగ్గురు రాజకీయ నేతలు ఒకేసారి అసెంబ్లీకి పోటీపడుతుండడం విశేషం. పార్టీలు వేరైనా ముగ్గురు నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూనే.. వారు విజయం సాధించాలని కోరుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
