ప్రలోభాలకు ఓటర్లు పడిపోతారా..? డబ్బు, మద్యానికి లొంగిపోతారా? చరిత్ర చెప్పే నిజం ఇదే..

Telangana Elections 2023: విధానాలు, నినాదాలతో తలపడాల్సిన బ్యాలెట్‌ యుద్ధంలో నిజంగానే ఉచిత తాయిలాలు, డబ్బు సంచులు గెలుపోటములను తారుమారు చేస్తాయా? పార్టీల నుంచి ఓటరు మహాశయులు కోరుకుంటున్నది ఉచిత పథకాలు.. ఓటుకు నోటు మాత్రమేనా?.. ఈ విషయంలో గతం ఏం చెబుతోంది.. వర్తమానంలో ఏం జరుగుతోంది? ప్రజలు ఓటేసే ముందు ఏ అంశాలకు ప్రభావితం అవుతారు?

ప్రలోభాలకు ఓటర్లు పడిపోతారా..? డబ్బు, మద్యానికి లొంగిపోతారా? చరిత్ర చెప్పే నిజం ఇదే..
View Point by Rajinikanth Vellalacheruvu, TV9 Managing Editor
Follow us

|

Updated on: Nov 04, 2023 | 7:57 PM

డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళదాం.. దమ్ముంటే దేవుడి ముందు ప్రమాణం చేద్దాం రండి.. అంటూ సవాళ్లు వినిపిస్తున్నాయి. మరో వైపు ఒకరు నియోజకవర్గంలో రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారట.. మరో సీటు రూ.50 కోట్లకు భేరం పెట్టారన్న ఆరోణలు వినిపిస్తున్నాయి. మరి విధానాలు, నినాదాలతో తలపడాల్సిన బ్యాలెట్‌ యుద్ధంలో నిజంగానే ఉచిత తాయిలాలు, డబ్బు సంచులు గెలుపోటములను తారుమారు చేస్తాయా? పార్టీల నుంచి ఓటరు మహాశయులు కోరుకుంటున్నది ఉచిత పథకాలు.. ఓటుకు నోటు మాత్రమేనా?.. ఈ విషయంలో గతం ఏం చెబుతోంది.. వర్తమానంలో ఏం జరుగుతోంది? ప్రజలు ఓటేసే ముందు ఏ అంశాలకు ప్రభావితం అవుతారు?

ప్రజాస్వామ్యం యెక్క మహోన్నత లక్ష్యం ప్రజలే తమ పాలకులను ఎన్నుకోవడం. తాము ఓటు వేసి ఎన్నుకున్న పాలకుల వల్ల తమ ప్రయోజనాలు నెరవేరాయా? లేదా? అన్నది బేరీజు వేసుకుని మరీ తదుపరి ఎన్నికల్లో తీర్పు ఇస్తుంటారు ప్రజలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారతావనిలో ఎన్నికల ప్రక్రియే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అయితే కొంతకాలంగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియపై అనేక విమర్శలు, విపరీత ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయమంటే సేవాభావం అనే విధానం నుంచి అధికారం, డబ్బు, ప్రజలపై గుత్తాధిపత్యం అనే భావన ప్రబలంగా వ్యాపించింది. అభ్యర్థులు పంచే డబ్బు, ప్రలోభాలు, ఆఖరి ఆరు నెలల్లో ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు మాత్రమే గెలుపోటములను ప్రభావితం చేస్తాయన్న చర్చ జరుగుతోంది.అయితే దీనిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ వంటి పథకాలను అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించారు కొందరు సామాజికవేత్తలు. కేంద్రం, రాష్ట్రాల అభిప్రాయం కోరిన అత్యున్నత న్యాయస్థానం దీనిపై విచారణ జరుపుతోంది. వాస్తవానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి నిర్ణయాలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.

నాయకుల అతి విశ్వాసం – ప్రజల విజ్ఞత..

అయితే ఎన్నికల ఏడాదిలో జనాకర్షణ పథకాలు, జనాల ఆంక్షాలను నెరవేర్చేందుకు పడే తాపత్రయం అధికార పార్టీల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని విస్మరించి తాము చేయాలనుకుంది చేస్తారు. మరీ 80-90ల చరిత్రకు పోకుండా గడిచిన రెండు దశాబ్ధాల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పులు చర్చిస్తే ఓటర్లు ఎంత తెలివైనవారో అర్ధమవుతుంది. వాస్తవానికి డబ్బు ప్రభావం ఎంత ఉంది అనే దానికంటే.. డబ్బుతోనే గెలుస్తామన్న అభిప్రాయానికి నాయకులు రావడం వల్లే వచ్చిన సమస్య కావొచ్చు ఇది. నిజంగానే ఎన్నికల ఏడాదిలో ముఖ్యంగా చివరి ఆరు నెలల ముందు పాలకులు తీసుకునే నిర్ణయాలు, ప్రకటించే పథకాలు, అభ్యర్ధులు పంచే డబ్బు గెలిపిస్తుందా.. అంటే ఇందుకు భిన్నమైన ప్రజాతీర్పులే అధికంగా కళ్లముందున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో…!

ఉమ్మడి రాష్ట్రంలో 2003లో తనపై అలిపిరిలో జరిగిన దాడిని సానుభూతిగా మలుచుకుని 2004 ఎన్నికల్లో మూడోసారి ముచ్చటగా అధికారపీఠాన్ని అందుకోవాలన్న చంద్రబాబునాయుడిని, తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఇందులో తాత్కాలికంగా కనిపించిన మానవీయకోణం, సానుభూతి కంటే కూడా అంతకుముందు రాష్ట్రంలో నెలకొన్న కరువు, విద్యుత్ ఛార్జీల పెంపు అనంతరం జరిగిన కాల్పులు ప్రముఖపాత్ర పోషించాయి. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాపోరాటాల ద్వారా జనాల్లోకి వెళ్లిన కాంగ్రెస్‌ వైపు ప్రజలు మొగ్గుచూపారు. ఇక ఇదే క్రమంలో 2009లోనూ ఎన్నికలు సమీపస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ తీసుకున్నవిధానపరమైన నిర్ణయాలను ప్రజలు స్వాగతించలేదు. అప్పటికప్పుడు తెలంగాణకు అనుకూలంగా కమిటీలు వేసి అనుకూల నివేదిక ఇచ్చి.. టీఆర్ఎస్‌, లెఫ్ట్‌ సహా పలు పార్టీలతో కలిసి మహాకూటమిగా జనాల్లోకి వచ్చారు. జనాకర్షణ పథకాలు కూడా భారీగా ప్రకటించారు. కానీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన సంక్షేమం ముఖ్యంగా ఉచిత విద్యుత్‌, విద్యుత్‌ బకాయిలు మాఫీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, 108 ఆంబులెన్స్‌లు ప్రజల సమస్యలు వినేతీరు, పాలనలో మార్పులు జనాలు గుర్తించి మళ్లీ అందలం ఎక్కించారు. ఎన్నికలకోసమే వచ్చిన విపక్ష కూటమి నినాదాలు, విధానాలను జనాలు స్వాగతించలేదు. ఈ రెండు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది ఐదేళ్ల పాలన తప్ప.. ఎన్నికల ఏడాదిలో మార్పులు కాదు.

రాష్ట్ర విభజన అనంతరం…

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ అనంతరం 2014 తెలంగాణ ఎన్నికల్లోనూ ఓటర్లు అనూహ్య తీర్పునే ఇచ్చారు. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. దశాబ్ధకాలం తర్వాత 2014 ఎన్నికల ముందే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చింది. 2009లో ప్రకటన చేసినా వెనక్కు తీసుకోవడం, తర్వాత కమిటీల పేరుతో కాలయాపనతో తెలంగాణ సెంటిమెంట్‌ బలంగా పెరిగింది. 2013లో ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టింది. ఏపీలో నష్టపోయినా తెలంగాణలో అధికారం దక్కుతుందని నమ్మారు కాంగ్రెస్ పెద్దలు. కానీ ప్రజలు అప్పటికే కాంగ్రెస్‌ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఐదేళ్ల అనుభవాలు వారికి కళ్లముందు కదలాడాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్నికల ముందు వరకు నాన్చిన కాంగ్రెస్‌ను కాదని.. ఉద్యమాన్ని నమ్ముకుని ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని సజీవంగా ఉంచిన బీఆర్ఎస్‌ (నాటి టీఆర్ఎస్‌)కు పట్టం కట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పట్ల కాంగ్రెస్‌ అవమానకరంగా, అవహేళన చేసేవిధంగా వ్యవహరించిందన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇక వైఎస్‌ ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులు, కిరణ్‌కుమార్‌ రెడ్డి తీరు కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అంటూ.. సెంటిమెంట్‌ ప్రయోగించినా కాంగ్రెస్‌ ప్రజలను తన వైపునకు తిప్పుకోలేకపోయింది. ఏపీలో అప్పుడున్న రాజకీయ సమీకరణల కారణంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. సీఎం జగన్‌ యాత్రకు విశేష స్పందన లభించినా.. అనుభవం ఉన్న నాయకుడు కొత్త రాష్ట్రానికి అవసరమని చంద్రబాబుకు మద్దతిచ్చారు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ ప్రజలు కేవలం ఎన్నికల ఏడాదిలో అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా.. గతం, వర్తమానం, భవిష్యత్తు ఆలోచించి మరీ తీర్పులిచ్చారు.

2019లోనూ..

అటు 2019 ఎన్నికల్లోనూ రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తికరమైన తీర్పులు ఇచ్చారు. నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలన చూసిన ప్రజలు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పట్టం కట్టారు. ఎన్నికలకు కొద్ది నెలల క్రితం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి చంద్రబాబు మొదలుపెట్టిన ధర్మపోరాటాలను ప్రజలు విశ్వసించలేదు. ఎన్నికల కోణంలోనే ప్రత్యేక హోదాపై చంద్రబాబు పదేపదే మాట మార్చారన్న ప్రచారం బలంగా జనాల్లోకి వెళ్లింది. దీనికి తోడు రాజధాని విషయంలో చూపించినంత స్పీడుగా పనులు జరగేలేదు. పైగా హైదరాబాద్‌ నుంచి అమరావతికి రావడానికి ఓటుకు నోటు కేసు కారణమన్న ప్రచారం కూడా బాగానే ప్రజల్లోకి వెళ్లింది. ఎన్నికలకు కొద్దిరోజులు ఉందనగా చివరి అస్త్రంగా టీడీపీ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో వేసిన 10వేల రూపాయల పసుపు – కుంకుమ డబ్బు కూడా ఓటుగా మారలేదు. మొత్తంగా ఎన్నికల ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాల కంటే కూడా ఐదేళ్ల పాలన చూసిన తర్వాత కోరుకున్న మార్పులో భాగంగానే వైసీపీ వైపు ఏపీ ఓటర్లు మొగ్గుచూపారు. అఖండ మెజార్టీతో గెలించారు. చంద్రబాబును కాదని.. 50 శాతానికి పైగా ఓట్లు, 80 శాతానికి పైగా సీట్లు ఇచ్చి మొత్తంగా 151 ఎమ్మెల్యేలతో పట్టం కట్టారు. ఇది ప్రజలు కోరుకున్న మార్పు. అదే సమయంలో ఏపీ బీజేపీ చరిత్రలోనే నోటా కంటే తక్కువ ఓట్లతో ఓడించారు. అంటే మార్పును కోరుకుంటూ ఏపీ ఓటర్లు విస్పష్ట తీర్పు ఇచ్చారు.

ఇక తెలంగాణ ఎన్నికల విషయానికి వస్తే 2018లో ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రత్యర్ధిగా బరిలో దిగింది. కానీ హస్తం పార్టీ ఎన్నికల ముందు చేసిన తప్పిదాలు, కేసీఆర్‌ పాలనలో ప్రజాప్రయోజనాలు చూసిన ప్రజలు మార్పు అవసరం లేదని భావించారు. రెండోసారి కూడా కేసీఆర్‌కే పట్టంకడుతూ తీర్పు ఇచ్చారు ఓటర్లు. రైతుబంధు సహా అనేక సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునర్‌నిర్మాణం, మిషన్‌ భగీరథ వంటి బృహత్తర ప్రాజెక్టులు ప్రజల కళ్లముందు కనిపించాయి. కేసీఆర్ ఐదేళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉండటం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింభించారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో.. తెలంగాణ రాష్ట్రంలో పాలనా పగ్గాలు మళ్లీ సమైక్యవాదులు చేతుల్లోకి పోతుందని ప్రచారం జరిగింది. ప్రజలు కూడా ఆ ప్రచారాన్ని నమ్మారు. ఫలితంగా అన్ని రంగాల్లో అభివృధ్ధివైపు పరుగులు తీస్తున్న సమయంలో కాంగ్రెస్‌ – టీడీపీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ వంటి భారీ హామీలు కూడా వారిని గెలుపు తీరాలకు చేర్చలేకపోయాయి. అందుకే కాంగ్రెస్‌ – టీడీపీలను తిరస్కరిస్తూ… బీఆర్ఎస్‌కు పట్టం కట్టారు. అందుకే 88 సీట్లతో కేసీఆర్‌కు తిరుగులేని అధికారాన్ని అప్పగించారు.

ఢిల్లీ పీఠంపైనా ప్రజాతీర్పులు..

ఇటీవల వచ్చిన స్కంద అనే సినిమాలో ఓ డైలాగ్‌ ఉంది.. ”రాజకీయాల్లో పదవి కావాలంటే ఇయ్యాలా.. పోయ్యాలా, తొయ్యాల.. అడ్డొస్తే ఏసెయ్యాలే ”.. అంటే ఓటర్లకు డబ్బు పంచాలి, మందు పొయ్యాలి, జైళ్లకు పంపాలి, అవసరం అయితే హత్యలు చేయాలి అని అర్ధం. సినిమాల్లో చూపించనట్టుగా, చెప్పినట్టుగా రాజకీయాలు లేవని పైన మనం చర్చించిన ఓటరు దేవుళ్ల తీర్పులు చెబుతున్నాయి. కేవలం రాష్ట్రాల్లోనే కాదు జాతీయస్థాయిలో ఢిల్లీ పీఠంపై ఎవరుండాలి అనేదానిపైనా ప్రజలు ఆలోచించి మరీ ఓటేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో… కశ్మీర్‌లో ఉండే ఓటర్లు అదే ఆలోచిస్తున్నారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలిచుకున్న బీజేపీకి ఆరు నెలలు తిరగకముందే నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చారు ఓటర్లు. అంటే కేంద్రంలో మోదీ నాయకత్వానికి జై కొట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కానీ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు. బెంగాల్‌, చత్తీస్‌ఘడ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ వంటి చాలా రాష్ట్రాల్లో కేంద్రంలో బీజేపీ ఉండాలని ప్రజలు భావించి అత్యధికంగా సీట్లు గెలిపించి తమ తీర్పు ఇచ్చారు. అంటే ప్రజలు రాష్ట్రంలో ఎవరుండాలి.. కేంద్రంలో ఎవరుండాలి అనే విజ్ఞత ప్రదర్శించి మరీ ఓటేస్తున్నారు.

ఒక్కసారి వెనక్కు వెళితే 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొన్ని ప్రజామోద నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ ఉపాధిహామీ పథకం, సమాచారహక్కు, ఆహారభద్రత, రుణమాఫీ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని 2009లోనూ నిలబెట్టాయి. ఆయన విజయానికి కారణమయ్యాయి. కానీ 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడ్డ స్కాములు, అవినీతి ఆరోపణలు ఈ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేలా చేశాయి. ఫలితంగా బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపించింది. అవినీతి పేరుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం చూడటం మొదలుపెట్టిన జనాలకు నరేంద్రమోదీ రూపంలో ఆశాకిరణం కనిపించింది. దీంతో మూడు దశాబ్ధాల తర్వాత మొదటిసారి బీజేపీకి 270కు పైగా సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్రమోదీ కూడా తన తొలి ప్రభుత్వంలో ప్రజల్లో విశ్వాసం కల్పించారు. అవినీతి లేని పాలన అందించారని ప్రజలు నమ్మారు. నిర్ణయాత్మక శక్తిగా మారారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో వరుసగా రెండోసారి గెలిపించారు. 303 సీట్లతో మళ్లీ అధికారం అప్పగించారు. బీజేపీకి బలం లేని చాలా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయపార్టీలు ఇచ్చే తాయిలాలు, పథకాలు దాటి సీట్లు – ఓట్లు సాధించింది. అంటే ప్రజలు ఎప్పుడు ఎవరికి ఓటు వేయాలి అనే విషయంలో పూర్తి స్పష్టతతో ఉంటున్నారు. విజ్ఞతతో ఆలోచించి మరీ ఓటేస్తున్నారన్నది విస్పష్టం.

ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, అంతకుముందు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు డబ్బులు ఇవ్వకుండా, సారాయి పంచకుండా ఓట్లకు వెళదామని సవాళ్లు విసరుకుంటున్నారు. మరోవైపు ఉచిత పథకాల్లోనూ పోటీని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి పార్టీలు. ఎమ్మెల్యేగా గెలవాలంటే రూ. 50 కోట్లు, రూ. 100 కోట్లు అని చర్చించుకుంటున్నారు. కానీ నిజంగా ప్రజలు డబ్బు, మద్యం, ఉచిత పథకాలు చూసే ఓట్లు వేసి ఉంటే.. చరిత్ర మరోలా ఉండేది. కానీ ప్రజలు అందరినీ గమనిస్తుంటారు.. అన్ని చూస్తుంటారు. బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటు వేసే ముందు వారి మనసు మాటే వింటారు. ఎవరిని గెలిపించాలి… ఎవరు అధికారంలో ఉంటే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే తీర్పులు నాయకులు కోరుకున్నట్టుగా కాకుండా.. ప్రజలు కోరుకుంటున్నట్టు ఉంటున్నాయి. చూసేవారి కోణంలోనే మార్పు ఉంది.. నాయకుల ఆలోచనల్లో తేడా ఉంది.. కానీ ప్రజలు ఎప్పుడూ విజ్ఞతతోనే ఓటేస్తున్నారన్నది గత కొన్ని దశాబ్ధాలుగా ఓటర్ల తీర్పుతో తేలన నిర్వివాద అంశం. నిజంగా ఎన్నికల్లో డబ్బు, మద్యం, అధికార బలం మాత్రమే శాసిస్తే హుజూరాబాద్‌లో బీఆర్ఎస్‌ గెలవాలి.. మునుగోడులో బీజేపీ అభ్యర్ధి గెలిచి ఉండాలి.. అలా జరగడం లేదంటే ఓటరు దేవుళ్లు పూర్తి స్వచ్ఛంగానే ఉన్నారు. ఇక ఈ విషయంలో రాజకీయ నేతలు సవాళ్లు చేసుకోవాల్సిన పనిలేదు?

-రజనీకాంత్ వెల్లల చెరువు, మేనేజింగ్ ఎడిటర్ (టీవీ9 తెలుగు)