TV9 Conclave: మంచి వాళ్ళకు బుల్డోజర్లతో పనిలేదు.. చెడ్డ పనులు చేసే వాళ్ళకే బుల్డోజర్లంటే భయం-ప్రకాష్ జవదేకర్
బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో జరిగిన కుంభకోణాలపై పూర్తిగా విచారణ జరుపుతామన్నారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో జరిగిన కుంభకోణాలపై పూర్తిగా విచారణ జరుపుతామన్నారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఒక కుటుంబం కోసం ఏర్పాటు కాలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. 50ఏళ్ల పాటు ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలు వారసత్వ రాజకీయాలపై విసిగిపోయారని, తెలంగాణకు మోదీ సుపరిపాలన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని బీజేపీ ప్రకటించిందన్నారు. అలాగే ఇంత కాలం పెండింగ్‌లో ఉన్న ఎస్సీ మాదిగ వర్గీకరణపై ప్రధాని మోదీ ప్రకటనతో.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టాయన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని ఎవరూ ఊహించలేదన్న జవదేకర్.. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ముస్లింలపై బీజేపీకి ఎలాంటి ద్వేషం లేదని మరోసారి స్పష్టం చేశారు ప్రకాష్ జవదేకర్. ముస్లింలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. త్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళల్లో మాకు మద్దతు పెరిగిందన్నారు. దేశంలోని ప్రజలందరికీ ఉచిత రేషన్ ఇస్తున్నామన్నారు జవదేకర్. నిరుపేదల ముస్లింలను ఆదుకునేందుకు అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. భారతీయ జనతా పార్టీలో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, పార్లమెంటుతో పాటు అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కూడా కేటాయిస్తున్నామని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తరుఫున ముస్లింలు ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారన్నారు. హిందువులకు, ముస్లింలకు సమాన హక్కులున్నాయన్న జవదేకర్.. ప్రధాని మోదీ నినాదం సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ అని స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లను ప్రకాష్ జవదేకర్ తప్పుబట్టారు. ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.
భారతీయ జనతా పార్టీ విధి విధానాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనన్న జవదేకర్. పార్టీ రూల్స్అందరికీ వర్తిస్తాయన్నారు. పార్టీ కష్టపడి పని చేసేవారికి తగిన గుర్తింపు ఉందన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పదవీకాలం పూర్తైంది, కాబట్టే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. సంజయ్‌కు ప్రమోషన్ ఇచ్చి నేషనల్ జనరల్ సెక్రటరీని చేసిన అధిష్టానం, సముచిత స్థానం కల్పించిందన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు జవదేకర్. విశ్వగురుగా పేరుగాంచిన ప్రధాని నరేంద్ర మోదీని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దారుణంగా తిట్టారని మండిపడ్డారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అసభ్యకర పదజాలంతో దూషించడం సరికాదన్నారు. మోదీపై రాహుల్ వ్యాఖ్యలు మాకే లాభమన్న జవదేకర్.. రాహుల్ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌కి, రాహుల్‌కి దేశ ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి వస్తున్న ప్రజాదరణ చూసి రాహుల్‌కు అసూయతో తట్టుకోలేక దిగజారుడు మాటలతో దూషిస్తున్నారన్నారు.
ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిందన్న ప్రకాష్ జవదేకర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికకు రూ.3 కోట్ల ఖర్చు చేస్తే, తెలంగాణలో ఒక్క కార్పొరేటరే రూ.3 కోట్లు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రభావం చూపడం మంచిది కాదన్నారు. దేశవ్యాప్తంగా కులగణనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదన్న ఆయన బీసీ కులాల లెక్కలు తేల్చాల్సిందేనన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలన వల్లే దేశ ప్రజల్లో వెనుకబాటుతనం పెరిగిందన్నారు. చెడ్డవాళ్లకే బుల్డోజర్లంటే భయమని వ్యాఖ్యానించారు ప్రకాష్ జవదేకర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
