AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Seats: గెలుపు గుర్రాల ఎంపికలో కాంగ్రెస్‌ జాగ్రత్తలు.. రెండో జాబితాలో హేమాహేమీలకు చోటు!

Telangana Election: తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి ఫస్ట్‌ లిస్ట్‌ ఎప్పుడో రిలీజ్‌ అయింది.. తాజాగా రెండో జాబితా విడుదలైంది.. అయితే.. టిక్కెట్లు ఆశించిన కాంగ్రెస్‌ నేతల్లో ఎవరెవరికి సీట్లు దక్కాయి?.. ఎవరెవరు పంతం నెగ్గించుకున్నారు?.. ఎవరికి పార్టీ షాకిచ్చింది?.. అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. అలాగే.. టిక్కెట్లు ఆశించి భంగపడ్డవారు ఎలా రియాక్ట్‌ అవుతారు?.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశాలు కూడా టీ.కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి.

Congress Seats: గెలుపు గుర్రాల ఎంపికలో కాంగ్రెస్‌ జాగ్రత్తలు.. రెండో జాబితాలో హేమాహేమీలకు చోటు!
Congress
Balaraju Goud
|

Updated on: Oct 28, 2023 | 7:43 AM

Share

తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి ఫస్ట్‌ లిస్ట్‌ ఎప్పుడో రిలీజ్‌ అయింది.. తాజాగా రెండో జాబితా విడుదలైంది.. అయితే.. టిక్కెట్లు ఆశించిన కాంగ్రెస్‌ నేతల్లో ఎవరెవరికి సీట్లు దక్కాయి?.. ఎవరెవరు పంతం నెగ్గించుకున్నారు?.. ఎవరికి పార్టీ షాకిచ్చింది?.. అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. అలాగే.. టిక్కెట్లు ఆశించి భంగపడ్డవారు ఎలా రియాక్ట్‌ అవుతారు?.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశాలు కూడా టీ.కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. అన్ని అంశాల్లో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోంది. గెలుపు గుర్రాల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే, టీ.కాంగ్రెస్‌ రెండో జాబితాలో హేమా హేమీలకు చోటు దక్కింది. పలువురు ముఖ్యనేతలు, సీనియర్లు, టిక్కెట్ల విషయంలో పంతం నెగ్గించుకున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల హడావుడి స్టార్ట్‌ అయిన నాటి నుంచి టీ.కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్‌, అంబర్‌పేట్‌, ఎల్బీనగర్‌, ఖానాపూర్‌ లాంటి నియోజకవర్గాలకు సంబంధించి రాజకీయం హీటెక్కింది. ఎవరికివారు టిక్కెట్ల కోసం ఢిల్లీ లెవల్లో ప్రయత్నాలు సాగించారు. ఈ క్రమంలోనే.. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధు యాష్కీ గౌడ్ లాంటి వారు రెండో జాబితాలో ఎమ్మెల్యే టికెట్లు పొందారు. క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ టికెట్ లభించింది. కానీ.. జూబ్లీహిల్స్‌ టిక్కెట్‌ కోసం పోరాడిన ఆ పార్టీ మరో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌కి మొండి చెయ్యి చూపించింది కాంగ్రెస్‌. అటు.. అంబర్‌పేట సీటు విషయంలో సీనియర్‌ నేత వీహెచ్‌ పెద్ద పోరాటమే చేస్తున్నారు. అలాంటిది.. ఆయనకు కూడా పార్టీ హైకమాండ్‌ షాకిచ్చింది.

మరోవైపు.. మధు యాష్కీ.. తన పంతం నెగ్గించుకుని.. ఎల్బీనగర్‌ టికెట్ సాధించారు. పీజేఆర్‌ కూతురు విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చారు. అటు.. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్‌ నాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్ కేటాయించారు. కానీ.. బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన.. ఖానాపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు మాత్రం చాన్స్‌ మిస్సయింది. అయితే.. ఆమె భర్తకు అవకాశం ఇవ్వడంతో రేఖా నాయక్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే.. ఇటీవలే, సొంత గూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మునుగోడు టికెట్ కట్టబెట్టారు. కానీ, అక్కడి నుంచి పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి టిక్కెట్‌ ఆశించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి పంతం నెగ్గించుకుని టిక్కెట్‌ సాధించి.. ఆ ఎలక్షన్స్‌లో సర్వశక్తులా పోరాడారు. దాంతో.. అప్పుడూ.. ఇప్పుడూ.. చలమల కృష్ణారెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చినట్లు అయింది. పాల్వాయి, చలమల టిక్కెట్‌ కోసం కొట్లాడుకుంటుండగా.. సడెన్‌గా మళ్లీ పార్టీలోకి వచ్చిన రాజగోపాల్‌రెడ్డిని అదృష్టం వరించింది. ఈ క్రమంలో.. కాంగ్రెస్‌లో సీనియర్లుగా ఉన్న పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారుతోంది.

వాస్తవానికి.. ఇన్నిరోజులూ అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఆదరించకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాంతో.. మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలకు కచ్చితంగా ప్రాధాన్యం కల్పించాలనే భావనలోనే హైకమాండ్ ఉంది. దానికి తగ్గట్లే, మొదటి జాబితాలో కొత్తవారికి మొత్తం 12 సీట్లు దక్కగా, రెండో జాబితాలోనూ 15 మంది కొత్తవారికి చోటు లభించింది. ఇప్పటివరకూ మొత్తం 100 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించగా, అందులో 27 మంది కొత్త అభ్యర్థులే ఉండటం హైలెట్‌ అని చెప్పొచ్చు. అయితే.. కొత్త వారికి టికెట్లు కేటాయించడంతో ఇప్పటివరకూ కాంగ్రెస్‌లో పాతుకుపోయిన.. ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేస్తున్నవారికి, పలువురు యువనేతలకు టికెట్లు దక్కలేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలావుంటే.. 15 స్థానాలను కాంగ్రెస్‌ పెండింగ్‌లో పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. వాటిలో.. కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ సీట్లలో బలమైన అభ్యర్థులను దింపాలని కాంగ్రెస్ చూస్తోంది. అటు.. పటాన్‌చెరువులో నీలం మధు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ సీటును పెండింగ్‌లో పెట్టారని తెలుస్తోంది. సూర్యాపేట సీటు కోసం మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో దాన్ని కూడా పెండింగ్‌లో పెట్టారు. తుంగతుర్తి సీటు విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. మిగతా సీట్ల విషయంలో ముఖ్య నేతలు తమ సన్నిహితుల పేర్లను ప్రతిపాదించడంతో ఆయా సీట్లను కాంగ్రెస్ నాయకత్వం వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టింది. మొత్తంగా.. మెజార్టీ స్థానాల్లో క్లారిటీ రావడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ తగ్గించి.. ప్రచారంపై దృష్టి సారించేందుకు కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు.

మొత్తంగా.. పలువురు ముఖ్యనేతలు పంతం నెగ్గించుకోగా.. మరికొందరికి మాత్రం కాంగ్రెస్‌ షాకిచ్చింది. ఈ నేపథ్యంలో.. టిక్కెట్లు ఆశించి భంగపడ్డవారి నుంచి ఎలాంటి రియాక్షన్స్‌ వస్తాయో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..