AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: క్లిక్ చేస్తే ఖతమే.. ఫేక్‌ ప్రొఫైల్స్‌తో బీ కేర్‌ఫుల్ అంటున్న పోలీసులు

Social Media Scams : రాష్ట్ర ప్రజలకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో, సోషల్ మీడియా నకిలీ ప్రొఫైల్స్, సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. వ్యక్తులు, సంస్థల పేర్లతో మోసగాళ్లు ఆర్థిక, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. స్నేహితులు డబ్బు అడిగినా, తక్కువ వడ్డీ రుణాల ఆఫర్లు వచ్చినా జాగ్రత్త వహించండి. బలమైన పాస్‌వర్డ్‌లు, గోప్యతా సెట్టింగ్‌లు ఉపయోగించండి. మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

Telangana: క్లిక్ చేస్తే ఖతమే.. ఫేక్‌ ప్రొఫైల్స్‌తో బీ కేర్‌ఫుల్ అంటున్న పోలీసులు
Farmer Mechanization Scheme (1)
Anand T
|

Updated on: Jan 09, 2026 | 7:50 AM

Share

ప్రస్తుత సాంకేతిక యుగంలో సోషల్ మీడియా అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైంది. సామాజిక మాధ్యమాల రాకతో ఇన్ఫర్మేషన్ ఊపందుకున్నప్పటికీ, నకిలీ ప్రొఫైల్స్ కారణంగా వ్యక్తిగత గోప్యత, భద్రత, ఆర్థికపరమైన అంశాలకు తీవ్ర భంగం కలగుతోంది. ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో ఫేక్ ప్రోఫైల్స్ క్రియేట్ చేసి వ్యక్తులు, ప్రముఖులు, సంస్థలు, ప్రభుత్వ విభాగాల పేర్లు, అధికారుల ఫోటోలు, అధికారిక లోగోలను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఉదంతాలను మనం తరచూ చూస్తూన్నాం. సోషల్‌ మీడియాల్లో దొరికే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మీకు తెలిసిన వాళ్లలా ఫోన్‌లు చేసి డబ్బులు అడగడం, తక్కువ వడ్డీకే తక్షణ రుణాలు ఇస్తామని నమ్మించడం, ఉద్యోగాలు లేదా పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

సైబరాబాద్ పోలీసుల సూచనలు..

  • సామాజిక మాధ్యమాల్లో మీకు వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేసే ముందు ప్రొఫైల్ నిజమైనదో కాదో నిర్ధారించుకోవాలి.
  • మీ స్నేహితులు లేదా బంధువుల పేరుతో అత్యవసరంగా డబ్బు అడిగితే, నేరుగా వారికి ఫోన్ చేసి నిర్ధారించుకోవడం మంచిది.
  • బ్యాంకింగ్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు మీ బ్యాంక్ వివరాలు, పిన్ నంబర్లు లేదా OTPలను ఫోన్ లేదా ఆన్‌లైన్‌లో ఎప్పుడూ అడగవు.. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి
  • వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులు, ఉద్యోగాలు లేదా తక్కువ వడ్డీకే రుణాలు అంటూ వచ్చే ఆఫర్లకు మోసపోవద్దు.
  • తెలియని అకౌంట్స్ నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు లేదా సందేశాలను నమ్మవద్దు. వ్యక్తిగత వివరాలు ఇవ్వడం, వీడియో కాల్స్‌ మాట్లాడడం, ఫోటోలు లేదా డాక్యుమెంట్లు పంపడం సమస్యలకు దారితీయవచ్చు.
  • అతి తక్కువ ధరలకు వస్తువులు లేదా వాహనాలు అమ్ముతామని చెబితే అప్రమత్తంగా ఉండాలి. మీ ఆశ నే మోసగాళ్ల పెట్టుబడి.
  • అడ్వాన్స్ చెల్లింపులు లేదా ప్రాసెసింగ్ ఫీజులు అడిగితే వెంటనే తిరస్కరించాలి.
  • OTPలు, బ్యాంక్ వివరాలు, UPI సమాచారం, ఆధార్ లేదా పాన్ వివరాలను ఎవరికీ ఇవ్వకూడదు.
  • అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు; తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదు.
  • ప్రతి సోషల్ మీడియా ఖాతాకు బలమైన పాస్‌వర్డ్ ఉపయోగించాలి.
  • ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌లు తప్పనిసరిగా ఉండాలి.
  • ప్రైవసీ సెట్టింగ్స్, టూ-స్టెప్ వెరిఫికేషన్ అమలు చేయాలి.
  • ప్రొఫైల్, ప్రొఫైల్ ఫోటోలను లాక్ చేసుకోవడం ఉత్తమం.
  • అనుమానాస్పద, ఫేక్ ఖాతాలను వెంటనే బ్లాక్ చేసి, సంబంధిత సోషల్ మీడియా వేదికలో రిపోర్ట్ చేయాలి.
  • సోషల్ మీడియాలో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం లేదా ప్రయాణ వివరాలను బహిరంగంగా పోస్ట్ చేయకపోవడం మంచిది.
  • ఏదైనా సంస్థ పేరుతో పెట్టుబడి ప్రతిపాదనలు వస్తే, ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలి.
  • సోషల్ మీడియాలో వేధింపులు ఎదురైతే నమ్మకమైన పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

    ఫిర్యాదు చేద్దమిలా..

మీరు ఒకవేళ సైబర్ మోసాలకు గురైనా, లేదా మీకు ఫేక్ అకౌంట్స్‌పై అనుమానం వచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి. కుదిరితే సమీప పోలీస్ స్టేషన్‌ను కు వెళ్లి ఫిర్యాదు చేయండి. సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ చాలా ముఖ్యం. క్రైమ్ జరిగిన తొలి గంటలో ఫిర్యాదు చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.