AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veena-Vani: 22వ వసంతంలోకి అడుగుపెట్టిన వీణ-వాణి.. ఇప్పడు ఏం చదువుతున్నారంటే..

రెండు మనసులుండొచ్చేమో. కానీ తనువొక్కటే. ఆ ప్రాణం ఒక్కటే. చూస్తూచూస్తూనే 21ఏళ్లు గడిచిపోయాయి. కన్నవారు కంటతడిపెట్టారేమోగానీ.. పసిప్రాయంనుంచీ ఇప్పటిదాకా ఒకరిగా బతుకుతున్న ఆ ఇద్దరి మొహాల్లో చిరునవ్వు ఏనాడూ చెరగలేదు. ఆత్మస్థైర్యం రవ్వంతైనా చెదరలేదు. ఎవరన్నారు ఇది లోపమని.. ఇంకా ఎవరంటారు అయ్యో పాపమని. విధిని ధిక్కరించిన సాహసం వాళ్ల సొంతం. బుడిబుడి అడుగులనుంచి భవిష్యత్తుకు బాట పరుచుకునేదాకా చెక్కుచెదరని సంకల్పం. 22వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆ అవిభక్త కవలల జీవనప్రయాణం.. రేపటి కలలరూపం.

Veena-Vani: 22వ వసంతంలోకి అడుగుపెట్టిన వీణ-వాణి.. ఇప్పడు ఏం చదువుతున్నారంటే..
Conjoined Twins Veena -Vani
Ram Naramaneni
|

Updated on: Oct 16, 2024 | 9:32 PM

Share

హ్యాపీ బర్త్‌డే వీణా వాణి. ప్రతీ సంవత్సరం అక్టోబరు 16వస్తే ఆత్మీయులేకాదు ఆ ఇద్దరూ కలకాలం జీవించాలని కోరుకునే ఎందరో .. తామేమీ కాకున్నా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూనే వస్తున్నారు ఈ అవిభక్త కవలలకి. 21ఏళ్లుగా ఆ ఇద్దరి యోగక్షేమాలు విచారిస్తూనే ఉన్నారెందరో. చూసేవాళ్లకు పాపం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తోందోనని సానుభూతి. కానీ తమ పరిస్థితిపై తోడబుట్టిన వీణవాణి ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క క్షణం కూడా ఆత్మన్యూనతకు గురికాలేదు. ఎందుకంటే ఎవరికీ ఇవ్వని వరాన్ని వాళ్లకిచ్చాడు ఆ దేవుడు. జీవితాంతం ప్రతీక్షణం కలిసి బతికే అవకాశాన్ని తమకిచ్చాడని భావించేంత అనుబంధం పెనవేసుకుపోయింది ఆ ఇద్దరి మధ్య. కష్టంగా లేదా అని అడిగితే ఎందుకూ.. మేం ఇంత ఇష్టంగా ఉంటుంటే అంటున్నారా ఇద్దరూ.

చదువైనా, ఆటపాటలైనా ఆ ఇద్దరే. ఒకరి మనసు ఒకరు గుర్తెరిగి ప్రాణానికి ప్రాణంలా పెరిగారు. అక్కచెల్లెళ్ల మధ్య సహజంగా ఉండే అలకలు, గొడవల్లాంటివేమీ కనిపించవు ఆ ఇద్దరి మధ్య. నీ సుఖమే నే కోరుకున్నా అన్నట్లు ఒకరికోసం ఒకరు పరితపిస్తూ పెరిగారు. ఆ ఇద్దరి మధ్యా సమన్వయం చూస్తే చూడముచ్చటేస్తుంది. ఇదికదా తోడబుట్టినబంధమంటే అనిపిస్తుంది. పడుకున్నా మేలుకున్నా, చదువుకున్నా నీకు నేను నాకు నువ్వు అన్నట్లు.. బలమైన బంధం. విడదీయలేని అనుబంధం.

రంగెలా ఉన్నా రూపమెలా ఉన్నా కన్నబిడ్డలను కళ్లారా చూసుకుంటే కొండంత ఆనందం. కానీ అరుదుగా పుట్టే అవిభక్త కవలలతో ఆ తల్లిదండ్రులు రెండు దశాబ్దాలుగా క్షోభపడుతూనే ఉన్నారు. అందరు పిల్లల్లాగే పరుగులు పెట్టాలని, జీవితాల్లో స్థిరపడి ఓ ఇంటివారు కావాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు. కానీ వీణావాణి విషయంలో వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆపరేషన్‌తో ఇద్దరినీ వేరుచేస్తే కళ్లారా చూడాలని కలలు కంటూనే 21 ఏళ్లు గడిచిపోయాయి. కూతుళ్లిద్దరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారనే సంతృప్తి ఉన్నా.. జీవితమంతా ఇలా గడిచిపోవాల్సిందేనా అన్న వేదన.. ఎంత లేదన్నా వెంటాడుతూనేఉంది. కానీ చేయగలిగిందేముంది. డబ్బే సమస్యయితే విశాల హృదయమున్న దాతలు కోకొల్లలు. కానీ ఆపరేషన్‌ ప్రక్రియ సంక్లిష్టం. వందశాతం విజయవంతం అవుతుందని చెప్పలేనంత కష్టం. అయినా ఆ తల్లిదండ్రుల్లో ఏదోరోజు అద్భుతం జరగకపోతుందా అన్న ఆశ ఇంకా సజీవంగానే ఉంది..

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళీ-నాగలక్ష్మి దంపతులకు నలుగురు కూతుళ్లు. రెండో సంతానంగా అవిభక్త కవలలుగా జన్మించారు వీణవాణి. వీళ్లకు అక్క, చెల్లి కూడా ఉన్నారు. 2003 అక్టోబర్ 16న జన్మించారు వీణావాణి. పుట్టినప్పట్నించీ 13 ఏళ్ల పాటు హైదరాబాదులోని నీలోఫర్ హాస్పిటల్లోనే ఉన్నారు. జన్మదినమైనా, ఏ కార్యక్రమమైనా ఆస్పత్రే ఫంక్షన్‌హాల్‌. డాక్టర్లు, సిబ్బందే అతిధులు.

పదమూడేళ్ల తర్వాత నీలోఫర్‌ నుంచి వీణావాణిని యూసఫ్‌గూడ స్టేట్ హోమ్‌కి తరలించారు. ప్రస్తుతం వీరు అక్కడే ఉంటూ సీఏ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ కావాలన్న తమ కలను సాకారం చేసుకోబోతున్నారు. ఇంటర్మీడియట్‌ సీఈసీలో ఇద్దరూ డిస్టింక్షన్‌లో సాయ్యారు. వీణ 707 మార్కులు సాధిస్తే.. వాణి 712 మార్కులు సంపాదించింది. అప్పట్లో ఇంటర్ బోర్డ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఎక్కువ సమయం ఇస్తామన్నా.. వద్దంటూ అందరిలాగే పరీక్షలకు అటెండయ్యారు వీణవాణి. ఆ పట్టుదలే వారిని సీఏ డిగ్రీ ఫైనలియర్‌దాకా తీసుకొచ్చింది.

కొన్ని జ్ఞాపకాలు ఆల్బమ్స్‌లో కాదు.. గుండెలోతుల్లో పదిలంగా అలా ప్రింటేసుకుని ఉండిపోతాయి. పుట్టాక పందొమ్మిళ్ల తర్వాత సొంతూరుకు వెళ్లినప్పుడు వీణవాణి అనుభూతి కూడా అలాంటిదే. వారిద్దరికే కాదు కన్నవారికి, ఆత్మీయ బంధువులకు, ఆ మాటకొస్తే ఆ ఊరు మొత్తానికి అది మరపురాని రోజే. పుట్టిన మూడోరోజునుంచే ప్రభుత్వ సంరక్షణలో ఉన్నారు వీణావాణి. అమ్మానాన్న అక్కాచెల్లిని అప్పుడప్పుడూ చూస్తున్నా.. సొంతూరెలా ఉంటుందో, అక్కడ తమ ఇల్లెలా ఉంటుందో పందొమ్మిదేళ్లు వాళ్లకు తెలీనే తెలీదు. దీంతో ఆ ఇద్దరి కోరికను కాదనలేకపోయారు అధికారులు. రెండేళ్లక్రితం.. 19 సంవత్సరాల వయసులో వారిని సొంతూరికి తీసుకెళ్లేందుకు అనుమతించారు. వీణావాణి గడపలోకి అడుగుపెట్టిన క్షణాన ఆ తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. సొంతూళ్లో అయినవాళ్ల మధ్య ఆనందంగా గడిపారు వీణావాణి.

మళ్లీ ఇన్నాళ్లకు సొంతూళ్లో, సొంతింట్లో జరిగింది వీణావాణిల 22వ బర్త్‌డే. ఊరుఊరంతా వచ్చి ఆ ఇద్దరినీ ఆశీర్వదించింది. అయినవాళ్ల ఆత్మీయత మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అవిభక్త కవలలు. అంతకంటే ఏంకావాలి వారికి చెప్పండి. వీణావాణీ మీ స్ఫూర్తి అమోఘం. మీ ఆశయం అద్భుతం. నిండునూరేళ్లూ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి