Revanth Reddy: ‘పైకి చెప్పేది ఒకటి.. చేసిన మరోకటి’.. ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ చీఫ్..
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హామీలు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు టి.కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హామీలు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు టి.కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల సంగతేంటని ప్రశ్నించారు. లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించగల బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు పై నిర్లక్ష్యం వహించడం, ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చేయడం, తెలంగాణ యువతకు నిరాశను మిగిల్చిందన్నారు. కాజీపేట ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దశాబ్దాల కల అని, విభజన చట్టం షెడ్యూల్ 13లో, 10వ అంశంగా దానిని పేర్కొన్నారని గుర్తుు చేశారు. ఈ హామీని కూడా అటకెక్కించారని విమర్శించారు. తెలంగాణలో 12 శాతం గిరిజనులు ఉన్నారని, ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చట్టం హామీ ఇచ్చిందన్నారు. తెలంగాణకి రావాల్సిన డిఫెన్స్ కారిడార్‌ను ఉత్తర ప్రదేశ్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు రేవంత్. కాంగ్రెస్ హాయంలో హైదరాబాద్‌కు ఫ్యాబ్ సిటీని మంజూరు చేసిందని పేర్కొన్న ఆయన.. సుమారు 15 లక్షల మంది యువతకు ఇందులో ఉపాధి లభించేదన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈ ప్రాజెక్టును నీరుగార్చారని విమర్శించారు.
వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం..
నిజామాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే వారం రోజుల్లో పసుపుబోర్డు తెస్తామని రైతులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారని బహిరంగ లేఖలో రేవంత్ పేర్కొన్నారు. అయితే, బీజేపీ అభ్యర్థి గెలిచిన తరువాత మాట మార్చి స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ పేరుతో మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెరకు రైతులను మోసం చేసిందన్నారు. వ్యవసాయ యాంత్రికీకరణను ప్రోత్సహించాల్సింది పోయి ఎరువులు, పురుగు మందులు, టార్పాలిన్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై 18 శాతం జీఎస్టీ వేశారని కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధించి రైతులపై భారం వేశారన్నారు. ఎరువులపై అగ్రిసెస్ పేరుతో రూ.30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం రైతుల నెత్తిన మోయలేని భారం మోపడమేనని అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని.. దానికి భిన్నంగా రైతులపై భారం మోపుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
