CM KCR:ఎదుటి మనిషిని ప్రేమించడమే మానవజాతి అభిమతం కావాలి.. క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పిలుపు
ప్రతి మతం తోటి వారిని ప్రేమించాలని మాత్రమే చెబుతుందని, ఏ మతం ఇతరులపై దాడి చేయాలని చెప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. మతం ఉన్మాద స్థితికి చేరితేనే ప్రమాదం అన్నారు.

CM KCR in Christmas Celebrations 2021: ప్రతి మతం తోటి వారిని ప్రేమించాలని మాత్రమే చెబుతుందని, ఏ మతం ఇతరులపై దాడి చేయాలని చెప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. మతం ఉన్మాద స్థితికి చేరితేనే ప్రమాదం అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎదుటి మనిషిని ప్రేమించే తత్వం అలవరుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం. తెలంగాణలో అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. దసరా, రంజాన్, క్రిస్మస్ ఇలా అన్ని మతాలకు చెందిన పండగలకు ప్రాధాన్యత ఇస్తున్నామని గుర్తు చేశారు. భారతదేశంలో నెల రోజులు గడువక ముందే ఓ పండగ వస్తుందని, ఇండియా భిన్న మతాలు, భిన్న జాతులు ఉన్న బ్యూటిఫుల్ కంట్రీ అని వ్యాఖ్యానించారు కేసీఆర్.
ఎదుటి మనిషిని ప్రేమించడమే మానవజాతి అభిమతం కావాలన్నారు. మానవ మనుగడ ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఈ భోగోళం మీద ప్రారంభమైంది. మానవ జీవితం అతి ఉజ్వలంగా ముందుకు సాగడానికి ఏ తరంలో చేపట్టాల్సిన పనులను ఆ తరంలో చేపట్టాలని సీఎం కేసీఆర్ తెలిపారు. శాస్త్రవేత్తలు ఎన్నో అమూల్యమైన విషయాలను ఈ సమాజానికి సమకూర్చారు. ఈ రోజు మనం నివసిస్తున్న నాగరిక సమాజానికి చేరుకోవడానికి ఎంతో మంది మహానుభావులు త్యాగాలు చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. స్థూలంగా మనిషిగా ఉన్న ప్రతి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించడమే అతి గొప్ప లక్షణం. ఏ మతంలో కూడా తప్పు చేయమని చెప్పలేదు. అందరూ శాంతిగా బతకాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తప్పులు చేయమని ఏ మతబోధకులు చెప్పలేదు. ఏ మతంలో కూడా తప్పులేదు. మతం ఉన్మాదస్థితికి వెళ్లినప్పుడే తప్పు జరుగుతోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.