AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Cabinet: రేపు తెలంగాణ మంత్రి మండలి కీలక భేటీ.. వరి ధాన్యం కొనుగోలు, కరోనా పరిస్థితులపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు రాష్ట్ర మంత్రి మండలి సమావేశంకానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ భేటీ జరగనుంది.

TS Cabinet: రేపు తెలంగాణ మంత్రి మండలి కీలక భేటీ.. వరి ధాన్యం కొనుగోలు, కరోనా పరిస్థితులపై చర్చ
Cm Kcr
Balaraju Goud
|

Updated on: Nov 28, 2021 | 3:39 PM

Share

Telangana Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు రాష్ట్ర మంత్రి మండలి సమావేశంకానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్న వేళ ఓమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఇప్పటికే ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ధక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్ వానా, జాంబియా, లెసాతో, జింబాబ్వే దేశాలకు వెళ్లొద్దని తమ పౌరులకు హెచ్చరికలు జారీచేశాయి. మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్‌పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దాని వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓమిక్రాన్‌పై అలర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ కేబినెట్ సోమవారం సమావేశం కానుంది. గతంలో కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే ఆంక్షలు విధించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే, గత కొంతకాలంగా వరి ధాన్యం కొనుగోళ్లపై ఉన్న అనిశ్చితి పరిస్థితి, రైతాంగం సమస్యలు, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై చర్చించనున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న సీఎస్‌.. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై మంత్రి మండలి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే, ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర కేబినెట్ కీలకంగా చర్చించనుంది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్.. పర్యటన పరిణామాలను కూడా వివరించనున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. ఈ విషయాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.

Read Also… D. Suresh Babu : అందుకే “దృశ్యం 2” సినిమాను థియేట్సర్స్‌కు ఇవ్వలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన సురేష్ బాబు..