Bandi Sanjay: హుస్నాబాద్‌లో రేపు లక్ష మందితో బీజేపీ భారీ బహిరంగ సభ.. వ్యూహాత్మకంగా ఏర్పాట్లు
బండి సంజయ్ పాదయాత్ర మొదటి దశ ముగింపునకు వచ్చింది. దీంతో రేపు కమలనాథులు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు

Telangana BJP: బండి సంజయ్ పాదయాత్ర మొదటి దశ ముగింపునకు వచ్చింది. దీంతో రేపు కమలనాథులు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇక రేపటి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమైంది బీజేపీ. బండి సంజయ్ తొలి దశ పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే రోడ్డు షోలో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ పాల్గొంటారు. తొలిదశ పాదయాత్ర సక్సెస్ చేశారంటూ ప్రజలకు ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలపబోతున్నారు బండి సంజయ్. సభ ఏర్పాట్లు, రోడ్ షో నిర్వహణపై వివిధ జిల్లాల అధ్యక్షులతో భేటీ అయ్యారు.
రేపు గాంధీ జయంతి సందర్భంగా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీతో కలిసి బండి సంజయ్ హుస్నాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి పట్టణమంతా రోడ్ షో నిర్వహిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర తొలి దశ పాదయాత్రను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. తొలిదశ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని కమలనాథులు చెప్తున్నారు. ఎక్కడుకు వెళ్లినా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టారంటున్నారు.
తెలంగాణ ప్రజల కోసం భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలు, పోరాటాలను హుస్నాబాద్ వేదికగా బండి సంజయ్ వివరిస్తారు. హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మీ టెంపుల్ నుంచి ప్రారంభమైన తొలిదశ పాదయాత్ర రేపటితో ముగుస్తోంది. ఎన్నికల వరకు విడతల వారిగా పాదయాత్ర చేపట్టాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్రను వేదికగా మలచుకోవాలనుకుంటున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలకంటే ముందే జనంలోకి వెళ్లారు సంజయ్. 5 విడతల్లో సంగ్రామ యాత్రకు ప్లాన్ చేశారు.