Telangana BJP: బీజేపీ రాష్ట్ర కార్యవర్గం భారీ విస్తరణ.. 125 మందితో ‘బండి’ జంబో కమిటీ..
Telangana BJP News: తెలంగాణ బీజేపీ రాష్ట్రకార్యవర్గాన్ని భారీగా విస్తరించేశారు బండి సంజయ్. ఏకంగా నూటా పాతిక మందితో రాష్ట్ర కమిటీని అనూహ్యంగా విస్త్రుతపరిచారు. కార్యవర్గం విస్తరణ వెనుక అసలు మతలబేంటన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Telangana BJP News: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని భారీగా విస్తరించారు బండి సంజయ్. ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా 125 మందికి చోటిచ్చారు. అంతేకాదు.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మేయర్‌లు, జడ్‌పీ ఛైర్మన్లతో సహా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లంతా రాష్ట్రకార్యవర్గ సమావేశాలకు స్పెషల్ ఇన్వైటీస్ అని ప్రకటించారు బండి సంజయ్. ఇదే ఇప్పడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.
ఓ వైపు అధ్యక్షుడి మార్పు అంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు ఈటలకు వ్యతిరేకంగా పార్టీ బ్యాక్‌గ్రౌండ్‌లో కథ నడుస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈలోగా బండి సంజయ్ తన మార్కు జంబో కమిటీని ప్రకటించేశారు. ఆశావహులందరినీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చేర్చేశారు బండి సంజయ్. బండి సంజయ్ జంబో కమిటీ వెనుక అసలు మతలబు ఏమిటన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఉప్పునిప్పుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సైలెంట్ గా ఉండిపోయారు. అధ్యక్ష మార్పు లేదంటూ సంకేతాలు ఇవ్వడానికే సంజయ్ రాష్ట్ర కార్యవర్గాన్ని 125 మందితో విస్తరించారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆఫీస్ బేరర్స్‌లోగానీ.. ఇతర పదవుల్లోగానీ ప్రత్యేకంగా ఎవరినీ నియమించకపోయినా.. పార్టీ రాష్ట్రకమిటీలో భారీ విస్తరణపై పెదవి విరుస్తున్నారు సీనియర్లు. పార్టీలోని పలువురు నేతలు తమకు సముచిత గౌరవం దక్కలేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది.




హైదరాబాద్ లో అమిత్‌షా పర్యటనకు రెండు రోజుల ముందు ఈ మార్పు ఎటువైపు దారితీస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో వైపు పార్టీలో గ్రూపులుగా విడిపోయి సమావేశాలు నిర్వహించుకోవడంపై పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అమిత్ షా ఏవిధంగా స్పందిస్తారనేది ఇప్పుడు కాషాయ పార్టీ నేతల్లో హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..