Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు షురూ.. సంతాప తీర్మానం అనంతరం సభ సోమవారానికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మొదలు కాగానే మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలిపారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మొదలు కాగానే మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలిపారు. 9 మంది మాజీ సభ్యులు ఇటీవల మృతి చెందారు. వారి సేవలను గుర్తు చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత సభ సోమవారానికి వాయిదా పడింది.
ఇటీవల మరణించిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణరావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత నగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్యకు శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మాణాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.
అలాగే, కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ సభ్యులందరూ నిబంధనలు పాటించాలని స్పీకర్ సూచించారు. సభ సజావుగా జరగాలంటే సభ బయట, శాసనసభ పరిసరాల్లో ప్రశాంతత ఉండాలని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాసనసభలో సభ్యులు అడిగిన సమాచారం వెంటనే అందజసే విధంగా చర్యలు తీసుకోవలన్నారు.
అసెంబ్లీ వాయిదా తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం మొదలైంది. సభలో చర్చించాల్సిన అంశాల అజెండాపై ఇందులో చర్చిస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, చీప్ విప్‌లు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీకి ఆహ్వానం అందలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలి, ఎంత సమయాన్ని కేటాయించాలన్న విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే బీఏసీ సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ మండిపడ్డారు. గడిచిన సారి ఇలాగే జరిగిందని విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం లేకుండా బీఏసీ సమావేశం ఏర్పాటు చేయడం వారికే చెల్లిందని రాజాసింగ్, రఘునందన్ విమర్శించారు.