Telangana Assembly: అసెంబ్లీలో విద్యుత్ రంగంపై వాడీ వేడీ చర్చ.. విద్యుత్ స్కాంపై విచారణకు జగదీశ్ రెడ్డి డిమాండ్
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగం పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య వాడీవేడీగా చర్చ జరిగింది.
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగం పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య వాడీవేడీగా చర్చ జరిగింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని, రూ.10 వేల కోట్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఘాటు స్పందించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. మధ్యలో కలుగజేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ స్కాంలపై జ్యూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.
యాదాద్రి విద్యుత్ స్కాంపై విచారణ తర్వాత జగదీష్ రెడ్డిని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న జగదీష్ రెడ్డి కాంట్రాక్టుల కోసం పార్టీలు మారిన వారా నా గురించి మాట్లాడేదంటూ ఆయన ఫైరయ్యారు. అయితే బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నట్లు భ్రమలో ఉన్నారని తమను అవమానకరంగా మాట్లాడితే సహించేదిలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఖబర్దార్ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
శాసన సభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు. దేశంలో అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు జగదీష్ రెడ్డి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమెట్ ఇండెక్స్‌లో ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.
2014 జూన్ 2 నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు రూ. 44,438 కోట్లు ఉంటే, అప్పులు రూ. 22,423 కోట్లు ఉండేదని జగదీష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ అప్పులు రూ. 81,016 కోట్లు ఉంటే, ఆస్తులు రూ. 1,37,570 కోట్లకు చేరుకుందని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదన్న జగదీశ్ రెడ్డి.. ప్రభుత్వ ఆస్తులు పెంచామని తెలిపారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతల జనం అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. పరిశ్రమలు, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్ లేని ఇల్లు ఉండేదా? అని ఆయన ప్రశ్నించారు.
కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ విచారణలో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. అర్థం లేని.. ఆధార రహిత మాటలు జనం నమ్మె పరిస్థితి లేదన్నార జగదీశ్ రెడ్డి. అయితే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆ విచారణతో పాటు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట విద్యుత్ రంగం అప్పులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిన అప్పుల వివరాలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ ప్రజలు విద్యుత్ కొత్తగా చూస్తునట్టు బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఇది అంశంపై మాట్లాడి బీజేపీ సభ్యులు బీఆర్ఎస్ తీరుపై ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. విద్యుత్ రంగంపై శ్వేత పత్రాన్ని పరిశీలిస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేస్తే .. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు కూడా అదే స్థాయిలో ఉన్నాయన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..