TS Assembly: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్.. ఈటల సహా ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
Telangana BJP MLAs: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ‘RRR’ షాక్ తగిలింది.
Telangana Assembly Budget Session: అనుకన్నట్లే జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ‘RRR’ షాక్ తగిలింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవగానే ఆర్ధిక మంత్రి హరీష్ రావు 2022 23 రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. కాగా హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. అంతేకాదు.. బడ్జెట్ కాపీలను చించేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావులను స్పీకర్ పోచారం సస్పెండ్ చేశారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావును సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు శాసనసభ ముందు తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ బడ్జెట్ సెషన్ పూర్తి అయ్యే వరకు ముగ్గురు బీజేపీ సభ్యలను సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అనంతరం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.
అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. నల్ల కండువాలతో అసెంబ్లీ ముందు బైఠాయించి నిరసన తెలుపారు. రాష్ట్రంలో రాజ్యాంగం విరుద్ధంగా పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.