నకిలీ విత్తనాలు తయారుచేసే కంత్రీగాళ్ల భరతం పడతాం.. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సీరియస్ వార్నింగ్
నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతో కష్టించి పంట పండించే రైతన్నలకు నకిలీ విత్తనాలు పెద్దశాపంగా మారింది.
నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతో కష్టించి పంట పండించే రైతన్నలకు నకిలీ విత్తనాలు పెద్దశాపంగా మారింది. రైతులకు సరఫరా చేసే నకిలీ విత్తనాలు తయారుచేసే కంపెనీల భరతం పడతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఫేక్ సీడ్స్ సరఫరా చేసే కంపెనీలు పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెప్పారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విత్తన విధానాలు 1966లో రూపొందించారని… అవి లోప భూయిష్టంగా ఉన్నాయని నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు వేదికల వద్ద రైతులు నిర్వహించే సమావేశాలకు పోలీసులు వెళ్లి నకిలీ విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. విత్తన చట్టాల బలోపేతానికి కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దేశంలో నకిలీ విత్తన తయారీ దారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ప్రధానంగా పత్తి, మిరప నకిలీ విత్తనాలపై నిఘా పెట్టినట్టు తెలిపారు. ఇప్పటికే ఈ సీజన్లో 177 కేసులు నమోదుచేసి 276 మందిని అరెస్ట్ చేశామని నిరంజన్ రెడ్డి తెలిపారు. విత్తనాల లైసెన్సింగ్ విధానం పారదర్శకంగా అమలుచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 3468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా పత్తి, సోయాబీన్, మిర్చి, వరి విత్తనాల్లో అధికంగా ఉంటున్నది. ఇటీవల కంది విత్తనాలు కూడా నకిలీవి వస్తున్నాయి. దళారులు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి పెద్ద మొత్తంలో హెచ్‌టీ కాటన్ విత్తనాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
Also Read: ఇన్ని పండ్లు ఒకే చోట.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి