AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో ప్రక్షాళన వేగవంతం.. ఐఏఎస్ అధికారుల బదిలీపై కొనసాగుతున్న సస్పెన్స్!

తెలంగాణలో మరికొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అంశంపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఈసారి కొంతమంది సీనియర్ ఐఏఎస్‌లకు కూడా స్థానచలనం ఉండొచ్చని తెలుస్తోంది. శనివారం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం..10 మంది ఐఏఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.

Telangana: తెలంగాణలో ప్రక్షాళన వేగవంతం.. ఐఏఎస్ అధికారుల బదిలీపై కొనసాగుతున్న సస్పెన్స్!
Telangana Ias
Prabhakar M
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 19, 2024 | 11:36 AM

Share

తెలంగాణలో మరికొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అంశంపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఈసారి కొంతమంది సీనియర్ ఐఏఎస్‌లకు కూడా స్థానచలనం ఉండొచ్చని తెలుస్తోంది. శనివారం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం..10 మంది ఐఏఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం వీరంతా వెయిటింగ్‌లో ఉన్నారు. వీపీ గౌతమ్, పి.ఉదయ్‌ కుమార్, పమేలా సత్పతి, భవేశ్ మిశ్రా, యాస్మిన్ బాషా, జి.రవి, హరిచందన దాసరి, ఎస్.వెంకటరావు, త్రిపాఠి, ఆల ప్రియాంకలకు పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. వీరితో పాటు కొంతమంది సీనియర్ అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో నియమితులై, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న అధికారులు, ఒకే పోస్టులో దీర్ఘకాలికంగా ఉన్నవారిని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రంలో అత్యంత కీలకమైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలకు ముఖ్య కార్యదర్శి లేరు. ఇప్పటివరకు ఈ రెండు శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్ శర్మ మే 31న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టులో ప్రభుత్వం ఎవరిని నియమించలేదు. కనీసం అదనపు బాధ్యతలను కూడా ఎవరికి అప్పగించలేదు. ఈ బాధ్యతల కోసం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా కూడా ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో రాబడి ఎక్కువగా ఉండే ఈ రెండు శాఖలకు సమర్థుడైన అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. దీంతో ప్రభుత్వం తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. సమర్థుడైన సీనియర్ అధికారిని నియమించడంపై దృష్టి పెట్టింది. ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్, అదనపు సీఈవో లోకేష్‌కుమార్, సంయుక్త సీఈవో సర్ఫరాజ్ అహ్మద్‌లను కూడా ప్రభుత్వంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వీరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరిని ప్రతిపాదించాలన్న అంశంపైనా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అధికారులకు సంబంధించిన రహస్య నివేదికలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులను తెప్పించుకుని పరిశీలిస్తోంది. త్వరలో ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…