Telangana: అమ్మను గెంటేస్తున్న రోజుల్లో.. ఈ కొడుకు ప్రేమ చూస్తే కళ్లు చెమర్చాల్సిందే..
కోటిరెడ్డి తన మరణించిన తల్లి లక్ష్మీనర్సమ్మపై ఉన్న అంతులేని ప్రేమను వినూత్నంగా చాటాడు. ఆమె ముఖచిత్రాన్ని చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుని, షర్ట్స్‌పై ముద్రించుకున్నాడు. తన ఉన్నతికి కారణమైన అమ్మ పేరున అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మాతృప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కథ అందరికీ ఆదర్శం.

ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చిరునామా అమ్మ. మనకు జన్మనివ్వడమే కాకుండా తన రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని తీర్చిదిద్దుతుంది. తల్లి ప్రభావం పిల్లలపై ఎంతో ఉంటుంది. అలాంటి అమ్మను దైవంగా భావిస్తుంటాం. అమ్మతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. అలాంటి తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటేస్తున్న ఈ రోజుల్లో ఓ కొడుకు మాత్రం తన తల్లి పై ఉన్న ప్రేమను చాటుతున్న తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వేపల మాదారంకు చెందిన లక్ష్మీనర్సమ్మ, శంభిరెడ్డి దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. ఉన్నంతలో వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు ఈ దంపతులు. చిన్న కొడుకు కోటిరెడ్డి అంటే తల్లికి ప్రేమ ఎక్కువ. అదే సమయంలో కోటిరెడ్డికి కూడా తల్లి అంటే ఎనలేని ప్రేమ. కరోనా సమయంలో తల్లి లక్ష్మీనర్సమ్మ మృతి చెందింది. రెండేళ్ల క్రితం తండ్రి శంభీరెడ్డి కూడా చనిపోయాడు. తనకు జన్మనివ్వడమే కాకుండా ఎదుగుదలకు కారణమైన తల్లిని కోటిరెడ్డి మర్చిపోలేదు. అతను తల్లి మీద ప్రేమను చంపుకోలేక ఆమె ముఖచిత్రాన్ని తన ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకోవాలనీ భావించాడు. కుటుంబ సభ్యులు వారించడంతో ఎడమ చేతిపై పచ్చబొట్టు పోడిపించుకున్నాడు.
నిత్యం తన తల్లి తన వెంట ఉన్నట్లు భావన కలిగేలా తన షర్ట్స్, టీషర్ట్స్ పైనా తన తల్లి బొమ్మను ముద్రించుకుని అమ్మ మీద ప్రేమను చాటుతున్నాడు. ఇలా చేయడం వల్ల నా తల్లి.. నా వెంటే ఉన్నట్లు అనిపిస్తుందని కోటిరెడ్డి తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. తన ఉన్నతికి తల్లి ఎంతో దోహదపడిందని కోటిరెడ్డి చెబుతున్నారు. మనల్ని ఈ భూమి మీదకు తీసుకొచ్చిన తల్లిని చనిపోయే వరకు మరవకూడదని అంటున్నారు. ఇప్పటికీ తన స్థాయికి తగినట్లుగా తల్లి పేరిట అన్నదానాలు, చిన్న చిన్న సహాయాలు చేస్తుంటానని కోటిరెడ్డి చెబుతున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
