గిరిపుత్రుల తలరాతలు మార్చే కంటైనర్ పాఠశాలలు వచ్చేశాయ్.. చిన్నారుల కేరింతలు!
జిల్లా కేంద్రంలోనే ఉన్నా అక్షర జ్ఞానానికి నోచుకోని గిరిపుత్రులకు నాలుగు అక్షరాలు నేర్పాలనే తాపత్రయం ఫలించింది. వివాదస్పద స్థలంగా కొనసాగుతున్న చోట శాశ్వత పాఠశాల నిర్మాణానికి ఆంక్షలు అడ్డురావడంతో కంటైనర్ రూపంలో పాఠశాల ప్రత్యక్షమైంది. ఇన్నాళ్లు చెట్టు నీడే పాఠశాలగా.. పూరి పాకే బడిగా సాగిన చోట అందమైన పాఠశాల గది ఏర్పాటవడం ఆ గిరిజన బిడ్డల మోముల్లో ఆనందాన్ని నింపింది. ITDA సహకారంతో జిల్లా కలెక్టర్ చొరవతో గిరు పుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగించే ప్రయత్నాలు సక్సెస్ అవడంతో అడవుల జిల్లా మురిసిపోతోంది. ఆ కంటైనర్ ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలేంటో మనం కూడా చూసొద్దం రండి..

ఆదిలాబాద్, జనవరి 6: అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల మండలంలో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న కాలనీ ఇది. పేరు కొమురంభీం కాలనీ.. గత కొన్నేళ్లుగా భూమి కోసం పక్కా ఇళ్ల నిర్మాణాల కోసం తాగు నీళ్ల కోసం కనీస వసతుల కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారు ఇక్కడి కాలనీ వాసులు. ఈ కాలనీలో నివాసం ఉండేదంత ఏ ఆదారం లేని గోండు బిడ్డలే. కనీసం ఉండేందుకు సరైన ఇళ్లుకూడా లేవు. అలాంటి చోట పక్కా పాఠశాల భవనం గురించి ఆలోచించడమే అనవసరం అన్నట్టుగా ఇన్నాళ్లు పరిస్థితులు కొనసాగాయి. ఓ చెట్టు నీడన ఓ రేకుల షెడ్డు కింద 20 మంది విద్యార్దులతో ఓ తాత్కాలిక పాఠశాల కొనసాగింది. తాజాగా జిల్లా కలెక్టర్, ఐటిడిఏ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించడంతో ఇదిగో ఇలా ఓ కంటైనర్.. పాఠశాలగా ప్రాణం పోసుకుంది.
ఈ కంటైనర్ పాఠశాల రాకతో ఇన్నాళ్లు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ గడ్డిగుడిసె కింద సాగిన కొమురంభీం కాలనీ గిరిపుత్రుల వానకాలం చదువులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ కాలనీ భూ సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంటడంతో ఆంక్షల కారణంగా ఇక్కడ రోడ్ల నిర్మాణం, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి అడ్డంకులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో అప్పటి ఆదిలాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా కొనసాగిన మంత్రి సీతక్క అదికారులను ఒప్పించి ఈ కంటైనర్ పాఠశాలకు అనుమతులు ఇప్పించింది. ఐటిడిఏ నిధులు విడుదల చేయడంతో ఈ కంటైనర్ పాఠశాల కొమురంభీం కాలనీకి చేరింది.
ఇదిగో ఇక్కడ సంతోషంతో కేరింతలు కొడుతున్నది కొమురంభీం కాలనీ ఆదివాసీ చిన్నారులే. తమ కొత్త పాఠశాల ప్రారంభం సందర్భంగా ఇలా సందడి చేశారు వీరంతా. వీరి మాతృభాష గోండు. ఇతర పిల్లలతో భాష సమస్యగా మారిందని ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా కొనసాగిన సీతక్కను కోరారు.. ఇటీవల కలెక్టర్ రాజర్షిషాను సైతం కలిశారు. వారి సమస్యను పరిష్కరించాలని ఐటీడీఏ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఐటీడీఏ అధి కారులు రూ.5.09 లక్షలతో 12.5 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవుతో కంటెయినర్ తయారు చేయించారు. ఈ కంటైనర్ లో మూడు ఫ్యాన్లు, ఆరు లైట్లు వెలిగేలా విద్యుత్తు సౌకర్యం కల్పించారు. ఈ కంటైనర్ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 20 మంది కొనసాగుతుండగా.. ఐటీడీఏ తాజాగా ఓ ఉపాధ్యాయురాలిని నియమించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




