Telangana: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా ఉద్రిక్తంగా మారింది. నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్‌కు చెందిన ఉప్పల మల్లయ్య అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రచారం ముగిసిన తర్వాత కాంగ్రెస్–బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది.

రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లాలో హింసాత్మకంగా మారాయి. నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ కు చెందిన ఉప్పల మల్లయ్య దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలో ప్రచారం ముగిసిన తర్వాత అర్ధరాత్రి కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఎదురు పడి ఘర్షణ పడ్డారు. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లయ్యను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా లింగంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.
సూర్యాపేటలో మల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పోలీసు బందోబస్తు మధ్య గ్రామానికి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెట్ నిర్వహించి గొడవలు లేకుండా మల్లయ్య అంత్యక్రియలు జరిగేలా పోలీసులు చేశారు. గ్రామంలోని ఉప్పల పాపయ్య, మల్లయ్య కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా వ్యక్తిగత కక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో మల్లయ్య కుటుంబ సభ్యుల చేతిలో పాపయ్య కుటుంబ సభ్యులు ఓటమిపాలవుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా మల్లయ్య కోడలు శైలజ నాలుగో వార్డ్ నుండి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్నారు. అదే వార్డు నుండి పాపయ్య కుటుంబానికి చెందిన మహిళ కూడా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య ఉన్న కక్షలు రాజకీయ కక్షలుగా మారాయనీ పోలీసులు చెబుతున్నారు. మల్లయ్య హత్యకు సంబంధించి కేసు నమోదు చేశామని, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో కాంగ్రెస్.. బీఆర్ఎస్ కార్యకర్తల హత్యలు, భౌతిక దాడులకు దిగుతోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై యదేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్త హత్యకు జిల్లా మంత్రులు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
