Hyderabad: ఆరి బడవల్లారా.. డెలివరీ బాయ్స్ అనుకుంటే.. మీరు చేసే యవ్వారం ఇదా..
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి... చదువులమ్మ చెట్టు నీడన ఇక్కడే కలిశాం అన్నట్లుగా.. వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి పేరున హైదరాబాద్‌కు వచ్చి గంజాయి అమ్మకాల ముఠాగా ఏర్పడి గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్న గంజాయి అమ్మకాలను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ గుట్టు రట్టు చేసింది.

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు చేరి పరిచయం పెంచుకున్న యువకులు.. చివరకు గంజాయి రవాణా ముఠాగా మారి నగరంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తున్న దందాను ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ (STF) ఏ టీమ్ గుట్టు రట్టు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నిత్యవసర సరుకులను ఇంటింటికి చేర్చే బ్లింకిట్ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తూ, మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తూ డబ్బు సంపాదిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్టీఎఫ్ ఏ టీమ్ అంజిరెడ్డి టీమ్ బుధవారం పట్టుకుంది. ఒరిస్సా, ఖమ్మం, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన పది మంది యువకులు హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లలో కలిసి నివసిస్తూ ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గంజాయి సేవించే అలవాటు ఉన్నవారే. మొదట కొనుగోలు కోసం గంజాయి దందా బ్యాచ్‌ను సంప్రదించిన వీరు, తర్వాత తామే తెప్పించి అమ్మితే లాభం ఎక్కువ అని భావించి ముఠాగా ఏర్పడ్డారు.
బీదర్, ఒరిస్సా ప్రాంతాల నుంచి తక్కువ ధరలకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తెప్పించి.. మాదాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్నట్లు STF తెలిపింది. బయటకు డెలివరీ బాయ్స్‌గా, హోటళ్లలో కార్మికుల్లా పనిచేస్తూ.. సైలెంట్‌గా నుంచి గంజాయి అమ్మకాలు పెంచుకుంటూ వచ్చిన వీరిని ఎస్టీఎఫ్ ఏ టీమ్ తాజాగా పట్టుకుంది. వీరి నుంచి.. 3.3 కిలోల గంజాయి, 6 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా బంజారాహిల్స్‌లోని SS కాంప్లెక్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.
నిందితులు శ్రీకాంత్ (కర్ణాటక), కిశోర్ (మనికొండ), ఉమేశ్ కుమార్ (ఒరిస్సా), సయ్యద్ అన్వర్ (ఖమ్మం), సింహచలరావు (ఒరిస్సా), అమర్ (కర్ణాటక), జోయ్ అలీ (కర్ణాటక), మహమ్మద్ అలీ (కర్ణాటక), ఇర్ఫాన్ (కర్ణాటక), బాబుల్‌పురి (కర్ణాటక)గా గుర్తించారు. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వారిని బంజారాహిల్స్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. డెలివరీ బాయ్స్ ముసుగులో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం హెచ్చరించారు. ఈ దందాను బయటపెట్టిన అంజిరెడ్డి టీమ్‌ను డైరెక్టర్ అభినందించారు .బ్లింకిట్ మాత్రమే కాకుండా ఇతర డెలివరీ కంపెనీలకు కూడా అధికారిక లేఖలు పంపాలని ఎక్సైజ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. డెలివరీ బాయ్స్ వద్ద డ్రగ్స్ లభిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
