75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి.. ధ్వజ స్తంభం ఉన్న ఏకైక..
సికింద్రాబాద్ సెయింట్ ఆండ్రూస్ ఆర్థోడాక్స్ చర్చి ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటోంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో సిరియన్ క్రైస్తవ ప్రార్థనల సంస్కృతికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏడాది పొడవునా జరిగే ఈ వేడుకలు చర్చి సుదీర్ఘ ప్రయాణం, వివిధ క్రైస్తవ డినామినేషన్ల మధ్య ఐక్యత, దాతృత్వం, సామాజిక సేవల పట్ల నిబద్ధతను చాటిచెబుతున్నాయి.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సిరియన్ క్రైస్తవ ప్రార్థనల సంస్కృతి ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాద్‌లోని చారిత్రక సెంట్ ఆండ్రూస్ ఆర్థోడాక్స్ చర్చి ఘనంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను జరుపుకుంటోంది. నవంబర్ 30న ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా జరగనున్నాయి. ఈ వేడుకలు కేవలం చర్చి సుదీర్ఘ ప్రయాణానికి చిహ్నం మాత్రమే కాదు.. తరతరాలుగా విభిన్న క్రైస్తవ డినామినేషన్ల మధ్య ఏర్పడిన ఐక్యత, సఖ్యత, సమన్వయానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
స్కాటిష్ చర్చి నుండి సిరియన్ క్రైస్తవ కేంద్రంగా..
ఈ చర్చిని మొదట 1865లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో నివసించే ఇంగ్లీష్ సైనికుల కోసం బ్రిటీష్ వారు నిర్మించారు. అప్పట్లో ఇది స్కాటిష్ చర్చిగా ప్రసిద్ధి చెందింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ చర్చి భారత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత దీనిని సిరియన్ క్రైస్తవ మతస్తులకు అప్పగించారు. 1948 మార్చి 5న యునైటెడ్ మలయాళం కాంగ్రిగేషన్ దీని నిర్వహణను స్వాధీనం చేసుకుంది. 1951లో ఆర్థోడాక్స్ చర్చి పారిష్‌గా ఏర్పాటు చేశారు. వలస కాలం నాటి భవనం ఒక శతాబ్దంపైగా కొనసాగిన తర్వాత 2002లో దానిని కూల్చివేశారు. ప్రస్తుతం ఉన్న చర్చి భవనం 2005 మార్చిలో ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ పారిష్ బెంగళూరు డయోసీస్ పరిధిలో, His Grace Geevarghese Mar Philoxenos పర్యవేక్షణలో నడుస్తోంది. తొలుత రెవరెండ్ ఫాదర్ కె కె మాథ్యూస్, ఆ తర్వాత మాథ్యూస్ మార్ బర్నబాస్ తొలి వికార్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రెవరెండ్ ఫాదర్ బినో శామ్యూల్ వికార్‌గా సేవలు అందిస్తున్నారు. సెయింట్ ఆండ్రూస్ ప్రాంగణం నేడు మత సామరస్యానికి, సామాజిక బంధానికి చిహ్నంగా నిలుస్తోంది. ఇదే ప్రాంగణంలో ఆర్థోడాక్స్ , మార్తోమా చర్చిలు ఆనుకుని ఉండటం దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఐక్యతకు నిదర్శనం. ఈ చర్చియే క్నానాయ, జాకొబైట్స్ వంటి ఇతర సిరియన్ క్రైస్తవ డినామినేషన్ల చర్చిల విస్తరణకు కేంద్రంగా మారింది. ఏడాది పాటు జరిగే ఈ ఉత్సవాలను ఐక్యత – దాతృత్వం అనే ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తున్నారు. విశ్వాసం సేవ పట్ల నిబద్ధతను చాటిచెప్పేలా వైద్య, రక్త దాన శిబిరాలు, యువజన క్రీడా పోటీలు నిర్వహిస్తారు. మలయాళ సంస్కృతులను ప్రతిబింబించే మ్యూజికల్ నైట్స్ ఈ ఉత్సవాలలో ముఖ్య భాగం.
ఈ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు కేవలం 75 వసంతాల ఉనికిని ఆస్వాదించడం మాత్రమే కాదు. సిరియన్ క్రైస్తవ ప్రార్థన సంస్కృతిని హైదరాబాద్‌కు తీసుకువచ్చిన మన పూర్వీకుల దూర దృష్టికి నివాళులు అర్పించడం కూడా అని రెవరెండ్ ఫాదర్ బినో శామ్యూల్ తెలిపారు. ‘‘75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఐక్యత, దాతృత్వం ద్వారా సంఘటితంగా ఉండాలని చర్చి ఉద్బోధిస్తున్నది. విభిన్న డినామినేషన్ల మధ్య సుహృద్భావాన్ని పెంచాలని పిలుపునిస్తోంది అని రాబిన్ విల్సన్ అన్నారు. ఈ ఉత్సవాలు ఐక్యత విలువలు, సేవాభావం పట్ల పునరంకితం కావాలని మనకు బోధిస్తున్నాయని ట్రస్టీ వి.జె. వర్గీస్ తెలిపారు. ప్రస్తుతం 400 కుటుంబాలకు నిలయంగా ఉన్న సెయింట్ ఆండ్రూస్ చర్చి, భవిష్యత్తులో దాతృత్వ కార్యక్రమాలను మరింత విస్తృతం కానుంది.
