Vande Bharat Trains: వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..! రైల్వేశాఖ నుంచి ఫుల్ క్లారిటీ
వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్‌పై నెలకొన్న గందరగోళానికి రైల్వేశాఖ తెరదించింది. మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మీడియా జరుగుతున్న ప్రచారం వల్ల ప్రయాణికుల్లో గందరగోళం నెలకొందని, అందుకే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు తెలిపింది.

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గత కొద్ది నెలులుగా ఇవి ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి సిటీల మధ్య వందే భారత్ సర్వీసులు ప్రయాణం సాగిస్తున్నాయి. దీంతో వీటి ద్వారా వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు లగ్జరీ ప్రయాణం చేస్తున్నారు. ఈ రైళ్లల్లో ప్రయాణికుల తాకిడి కూడా ఎక్కువగా ఉండటంతో త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. కొత్త ఏడాదిలో రెండు రాష్ట్రాల ప్రజలకు వందే భారత్ స్లీపర్ ట్రైన్ కూడా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే దూరపు ప్రయాణాలు చేసేవారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంత్‌పూర్, యశ్వంత పూర్-కాచిగూడ మధ్య దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ సర్వీసులు నడుపుతోంది. ఈ సర్వీసుల షెడ్యూళ్లకు సంబంధించి ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై అధికారుల స్పందించారు. నిర్వహణ కారణంగా వారంలో ఒకరోజు వందే భారత్ ట్రైన్ల సర్వీసులను నిలిపివేస్తున్నారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు ఇక నుంచి శుక్రవారం సర్వీసులు అందించదని, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ సర్వీసులు సోమవారం అందుబాటులో ఉండవని మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రయాణికుల అనుమానాలను తొలగించేందుకు ఈ వార్తలపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ ఇచ్చింది.
సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్ సర్వీసులను సోమవారం నిలిపివేశారు. మంగళవారం నుంచి ఆదివారం వరకు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ తెలిపింది. ఇక కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ వందే భారత్ ట్రైన్ సర్వీస్ బుధవారం నిలిపివేశామని, మిగతా రోజుల్లో యధాతథంగా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రయాణికుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొంది.
