Hyderabad: దుర్గం చెరువు తరహాలో హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి.. త్వరలోనే శంకుస్థాపన.. ఈ ఏరియాలోనే..
హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జ్ రానుంది. ప్రస్తుతం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఉన్న విషయం తెలిసిందే. మాదాపూర్ సమీపంలోని ఈ బ్రిడ్జి హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే నగరంలో ఇలాంటి తరహా కేబుల్ బ్రిడ్జి మరొకటి నిర్మాణం కానుంది.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్‌లో ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. మాదాపూర్ సమీపంలో ఉండే ఈ బ్రిడ్జి చూసేందుకు ఎంతోమంది తరచూ వస్తుంటారు. రాత్రి అయితే చాలు.. కేబుల్ బ్రిడ్జిపై ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో సందడి చేస్తూ ఉంటారు. ఇక వీకెండ్స్‌లో అయితే ఇక్కడ మరింత రద్దీ ఉంటుంది. ఇక చాలా తెలుగు సినిమాల్లోనూ ఈ కేబుల్ బ్రిడ్జి సీన్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇదే తరహాలో భాగ్యనగరంలో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కానుంది. త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దుర్గం చెరువు బ్రిడ్జి తరహాలో ఇది కూడా హైదరాబాద్ సిగలో మరో మణిహరంగా మారనుంది. నగరంలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నగరంలో నిర్మిస్తున్న ఈ రెండో కేబుల్ బ్రిడ్జి విశేషాలు ఏంటో చూద్దాం.
ఈ రూట్లోనే నిర్మాణం
హైదరాబాద్‌లో త్వరలో రెండో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం మొదలుకానుంది. మీర్ ఆలం ట్యాంక్ మీదుగా చింతల్మెంట్ రోడ్డును బెంగళూరు జాతీయ రహదారికి ఇది కలపనుంది. దాదాపు 2.65 కిలోమీటర్ల పొడవున ఇది ఉండనుండగా.. 22.2 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. మీర్ ఆలం ట్యాంక్ మీదుగా ఇవి విస్తరించి ఉంటుంది. ఆ ట్యాంక్ సమీపంలోని నేషనల్ హైవే 44 వంతెన దగ్గర ఈ కేబుల్ బ్రిడ్జి ప్రారంభం కానుండగా.. మీర్ ఆలయం పార్క్ సమీపంలోని చింతల్మెట్ రోడ్డు వద్ద వరకు ఉంటుంది. ఇక ఈ వంతెన ఎగ్జిట్, ఎంట్రీ ర్యాంప్‌లు మీర్ మహమూద్ పహాడీ, కింగస్ కాలసీ శాస్తిపురం రోడ్డు సమీపంలో ఉంటాయి. మూసి నదికి దక్షిణ దిశలో ఉండే మీర్ ఆలం ట్యాంక్‌కు మాజీ ప్రధాని మీర్ ఆలయం బహుదూర్ పేరు పెట్టారు. ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ ఏర్పాటుకు ముందు ఇది హైదరాబాద్ ప్రజలకు ప్రధాన తాగునీటి వనరుగా ఉండేది.
రెండో కేబుల్ బ్రిడ్జి
4 లైన్లుగా ఈ కేబుల్ బ్రిడ్జి విస్తరించి ఉంటుంది. చాలాకాలంగా ఇది పెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఈ బ్రిడ్జి రాకతో మీర్ ఆలం ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో జీవనోపాధికి ఉపయోగపడనుంది. అలాగే ప్రజలకు వినోద స్థలంగా కూడా సహాయపడనుంది. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వాహనదారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందించడంలో ఇది సహాయపడుతుంది. హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద వంతెనగా ఇది నిలవనుంది. ప్రస్తుతం మాదాపూర్‌లోని ఇనార్బిట్ సమీపంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఉంది. ఇది జూబ్లీహిల్స్‌ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో కలుపుతుంది. దీని వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది.
