Indoor Plants: గుమ్మం ముందు కాదు.. ఈ మొక్కలను బెడ్రూమ్‌లో పెంచితే ఏమవుతుందో తెలుసా?
ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతమైన నిద్ర ఒక లగ్జరీగా మారిపోయింది. బెడ్ రూమ్ లో సరైన లైటింగ్, ఏసీ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ చాలామందికి గాఢ నిద్ర పట్టదు. అయితే, అందానికి అందాన్ని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కల పాత్రను మనం తరచుగా విస్మరిస్తుంటాం. కొన్ని రకాల ఇండోర్ మొక్కలు మీ గదిలోని గాలిని శుద్ధి చేయడమే కాకుండా, మీ మూడ్‌ను మార్చి ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తాయి. ఆ 7 అద్భుతమైన మొక్కల వివరాలు ఇప్పుడు మీకోసం..

మొక్కలు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు, అవి జీవంతో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లు. ముఖ్యంగా రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలు బెడ్ రూమ్ కు ఎంతో శ్రేయస్కరం. ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి ప్రమాదకర విషవాయువులను పీల్చుకుని మనకు స్వచ్ఛమైన గాలిని అందించే స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీ వంటి మొక్కల గురించి మీకు తెలుసా? అలాగే లావెండర్, మల్లె వంటి సువాసన భరిత మొక్కలు మీ ఒత్తిడిని ఎలా తగ్గిస్తాయో తెలుసుకుందాం..
1. స్నేక్ ప్లాంట్ :
ఇది గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్లు, బెంజీన్ వంటి విషపదార్థాలను తొలగిస్తుంది. దీనికి తక్కువ నిర్వహణ సరిపోతుంది. రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేయడం దీని ప్రత్యేకత.
2. పీస్ లిల్లీ :
తెల్లని పూలతో అందంగా ఉండే ఈ మొక్క అమ్మోనియా, బెంజీన్ వంటి విషాలను పీల్చుకుంటుంది. గదిలో తేమను సమతుల్యం చేస్తూ హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది.
3. కలబంద :
ఔషధ గుణాలకు పెట్టింది పేరైన కలబంద, గాలిని శుద్ధి చేయడంలోనూ దిట్ట. దీనికి తక్కువ నీరు, పరోక్ష కాంతి ఉంటే సరిపోతుంది.
4. మల్లె :
మల్లెల సువాసన మనస్సును ప్రశాంతపరిచి, ఆందోళనను తగ్గిస్తుంది. కిటికీ దగ్గర ఎండ తగిలే చోట దీన్ని ఉంచితే గది అంతా సువాసనలతో నిండిపోతుంది.
5. అరెకా పామ్ :
ఇది సహోజ తేమను అందిస్తుంది. గాలిలోని కార్బన్ మోనాక్సైడ్ వంటి విషాలను తొలగిస్తూ గదిని తాజాగా ఉంచుతుంది.
6. మనీ ప్లాంట్ :
కనీస సంరక్షణతో పెరిగే ఈ మొక్క, గాలిలోని హానికర రసాయనాలను ఫిల్టర్ చేస్తుంది. తక్కువ సమయం ఉన్నవారికి ఇది ఉత్తమ ఎంపిక.
7. లావెండర్ :
దీని సువాసన నిద్ర నాణ్యతను పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి గాఢ నిద్రలోకి జారుకునేలా చేయడంలో లావెండర్ పాత్ర అమోఘం.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీకు అలర్జీలు ఉంటే మొక్కలను ఎంచుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
