Telangana: మాస్టారూ.. మా మెగాస్టారూ.! టీచర్‌కు లైఫ్‌లోనే తోపు పార్టీ.. సీన్ కట్ చేస్తే
పాఠాలు చెప్పే మాస్టారు రిటైర్‌మెంట్ తీసుకున్నారని.. స్టూడెంట్స్ ఏకంగా ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఆయన ఇంటి దగ్గర నుంచి మేళతాళాలు.. వాయిద్యాలతో ఊరేగింపుగా స్కూల్‌కు తీసుకొచ్చారు. ఇది ఖమ్మంలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

ఎక్కడ విధులు నిర్వహించినా అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ముందుంటారు ఉపాధ్యాయులు. పని చేసిన ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో మమేకమవుతూ వారికి ఉత్తమ బోధన అందిస్తారు. అలాంటి ప్రధానోపాధ్యాయులు పదవి విరమణ చేపడుతున్న సందర్భంలో ఆ పాఠశాల విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికి తమ గురుభక్తిని వెరైటీగా చాటుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయుడి ఇంటి నుంచి పాఠశాల వరకు డప్పు, వాయిద్యాల మధ్య విద్యార్థులు పూలు చల్లుతూ కోలాటం ఆడుతూ పాఠశాలకు తీసుకువెళ్లారు. ఈ అరుదైన సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన హరి శ్రీనివాస్.. స్థానిక సింగారెడ్డి ప్రాథమిక పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా హెడ్మాస్టర్‌గా పని చేస్తున్నారు. పాఠశాలను అన్ని రంగాల్లో మేటిగా నిలపడమే కాదు.. రాష్ట్రస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. తాను చదివిన పాఠశాలకే ప్రధాన ఉపాధ్యాయుడిగా వచ్చారు. నాటి నుంచి పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు. ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తూ విద్యార్థులతో మమేకమై వారి అభివృద్ధికి తోడ్పాటు అందించారు. తమకు నచ్చిన ప్రధాన ఉపాధ్యాయుడు పదవి విరమణ చేపడుతున్న సందర్భంలో ఘనంగా వీడ్కోలు పలకాలని విద్యార్థులు నిర్ణయించారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులతో పాటు ఆయన సతీమణిపై పూలు చల్లుతూ, కోలాటం ఆడుతూ, డబ్బుకు వాయిద్యాల మధ్య ఉపాధ్యాయుడి ఇంటి నుంచి కిలోమీటరు దూరం ఉన్న పాఠశాలకు తీసుకువెళ్లారు. స్వయంగా విద్యార్థులే కోలాటం ఆడుతూ స్వాగతం పలుకుతూ పాఠశాల వద్దకు తీసుకువెళ్లి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలువురు గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
