Indravelli: ఆ నెత్తుటి జ్ఞాపకానికి 42 ఏళ్లు.. మరో జలియన్ వాలాబాగ్‌ను తలపించే ఘటనపై ప్రత్యేక కథనం
జల్ జంగిల్ జమీన్ అంటూ.. హక్కుల కోసం ఉద్యమించిన అమాయకపు అడవిబిడ్డలపై ఆనాటి సర్కారు తుపాకీ తూటాల వర్షం కురిపించింది. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో పదులసంఖ్యలో గిరిపుత్రులు నేలకొరిగారు. మరో జలియన్ వాలాబాగ్ ను తలపించేలా నెత్తుటి ప్రవాహం పారింది. అడవి ఎరుపెక్కి విప్లవ గర్జనై పోరు సలిపింది...

జల్ జంగిల్ జమీన్ అంటూ.. హక్కుల కోసం ఉద్యమించిన అమాయకపు అడవిబిడ్డలపై ఆనాటి సర్కారు తుపాకీ తూటాల వర్షం కురిపించింది. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో పదులసంఖ్యలో గిరిపుత్రులు నేలకొరిగారు. మరో జలియన్ వాలాబాగ్ ను తలపించేలా నెత్తుటి ప్రవాహం పారింది. అడవి ఎరుపెక్కి విప్లవ గర్జనై పోరు సలిపింది. ఆ నెత్తుటి గాయానికి నేటితో 42 ఏళ్లు పూర్తి. ప్రాణత్యాగం చేసిన ఆ నాటి అమరుల వీరత్వానికి నిలువెత్తు సాక్ష్యం ఇదిగో ఈ ఇంద్రవెళ్లి స్తూపం. గత పోరాటాల స్పూర్తిని నేటికి రగిలిస్తూ ఠీవిగా నిలబడి కలబడమంటోంది. జల్ జంగిల్ జమీన్ అంటూ మరోసారి గర్జించమంటోంది.
1981, ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది ఆనాటి గిరిజనం. భూమి కోసం భుక్తి కోసం నియంతృత్వ ప్రభుత్వం నుండి విముక్తి కోసం పోరాటానికి తుడుం మోగించింది. జల్ జంగిల్ జమీన్ అంటూ నినదిస్తూ రగల్ జెండా ఊపింది. ఈ పోరాటానికి అనుమతి లేదంటూ ఆ నాటి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసింది. అవేమి లెక్క చేయకుండా తుపాకీ తూటాలను సైతం ఎదుర్కొనేందుకు మావనాటే మావ సర్కార్ అంటూ నినదిస్తూ పోరు సలిపింది ఆ నాటి ఆదివాసీ జనం. ఫలితం పదుల సంఖ్యలో అమాయక అడవి బిడ్డల ప్రాణాలు ఖాకీల తూటాలకు గాలిలో కలిసిన పరిస్థితి. పచ్చని అడవంతా నెత్తుటి దారాలతో ఎరుపెక్కిన స్థితి. ఆనాటికి నెత్తుటిగాయామికి సరిగ్గా నేటితో 42 ఏళ్లు పూర్తయ్యాయి.
1981, ఏప్రిల్ 20న సోమవారం ఉదయం నలు దిక్కుల నుంచి పిల్లజెల్లా ముసలిముతక అన్న తేడా లేకుండా గిరిజనం దండుకట్టి తుడుం మోగించి సమరానికి ఇంద్రవెళ్లికి సిద్దమైంది. ఆదివాసీలను అడ్డుకునేందుకు రోడ్ల పై ముళ్ల కంచెలు వేసింది ఆనాటి సర్కార్. రహదారులను దిగ్భంధించింది.. తుపాకులు ఎక్కుపెట్టింది.. కానీ గిరిజనం ఇవేమి లెక్క చేయలేదు.. తాడోపేడో తేల్చుకోవాలని కసితో ఉన్న ఆదివాసీ మహిళా లోకం పోలీసులను నెట్టుకుంటూ ముందుకుసాగింది. ఆ సమయంలో ఆదివాసీ మహిళతో ఓ పోలీసు అసభ్యంగా ప్రవర్తించడం.. బడిసందుకున్న ఆ మహిళ కానిస్టేబుల్ పై దాడి చేయడం… అక్కడికక్కడే ఆ పోలీసు నేలకూలడం.. క్షణాల్లో ఆ ప్రాంతం రణక్షేత్రమైంది. తుపాకులు ఎక్కిపెట్టిన ఆనాటి ఖాకీల తూటాల వర్షానికి 13 మంది ఆదివాసీలు అకడిక్కడే నేలకొరిగారు.. మరో 60 మంది గాయాల పాలై అసువులు బాశారు. ఆ నెత్తుటి గాయానికి సజీవ సాక్ష్యమైంది ఇంద్రవెళ్లి.




కాల్పుల ఘటనకు సజీవ సాక్షిగా ఇంద్రవెల్లిలోని హీరాపూర్ సమీపంలో రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో అమరవీరులు స్థూపం ఏర్పాటు చేసింది. కానీ 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు డైనమైట్లతో ఆ స్తూపాన్ని కూల్చి వేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం 1987లో సర్కార్ నిధులతో అమరుల స్మారక స్తూపాన్ని నిర్మించింది. ఆ స్మారక స్తూపమే ఇప్పటికి ఆదివాసీల అమరుల జ్ఞాపకంగా నిలిచి సంస్మరణ వేదికగా సాగుతోంది. ఇంద్రవెల్లిలో పోలీసుల మారణకాండ అనంతరం 1982లో పీపుల్స్ వార్ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో అమరుల జ్ఞాపకార్థం ఇంద్రవెళ్లి హీరాపూర్ లో అమర వీరుల స్థూపాన్ని నిర్మించింది. 1989 తర్వాత స్థూపం దగ్గర సంస్మరణ సభను నిర్వహించుకునేందుకు మాత్రం ఆనాటి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రతి ఏటా ఏప్రిల్ 20న నిషేధాజ్ఞలు కొనసాగుతూ వచ్చాయి. తెలంగాణ సిద్దించడంతో 2015 లో ఆంక్షలు ఎత్తివేసి.. స్వేచ్ఛాయుత వాతావరణంలో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది.
నరేశ్,
టీవీ9 తెలుగు ప్రతినిధి, ఆదిలాబాద్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
