AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: వీళ్లు కొడుకులా రాక్షసులా.. తల్లి చనిపోతే కూడా.. గుండెను పిండేసే ఘటన..!

అంతిమ ఘడియల్లో ఎలాంటి జీవనం సాగించిందో ఏమో కానీ చివరకు అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోయిందా అవ్వ.. ఆస్తిపాస్తులు పంచుకునే వరకు బాగానే ఉన్నా అవసాన దశకు చేరుకున్న ఆమెపై పెంచుకున్న బిడ్డలు చూపిన వివక్ష స్థానికులను కలిచి వేసింది. ఆస్తులు సగం సగం పంచుకున్నందున నెలకొకరు అవ్వకు ఇంత బువ్వ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

Telangana News: వీళ్లు కొడుకులా రాక్షసులా.. తల్లి చనిపోతే కూడా.. గుండెను పిండేసే ఘటన..!
Sons Who Did Not Perform Funeral Rites In Jagitiyal
G Sampath Kumar
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Dec 27, 2024 | 8:24 PM

Share

రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు కాకున్నా కంటికి రెప్పలా చూసుకుంటారని కలలు కన్నదా తల్లి.. కాటికి చేరిన తరువాత కూడా కన్న తల్లిలా అంత్యక్రియలు చేస్తారునుకుంది. అంతిమ ఘడియల్లో ఎలాంటి జీవనం సాగించిందో ఏమో కానీ చివరకు అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోయిందా అవ్వ.. ఆస్తిపాస్తులు పంచుకునే వరకు బాగానే ఉన్నా అవసాన దశకు చేరుకున్న ఆమెపై పెంచుకున్న బిడ్డలు చూపిన వివక్ష స్థానికులను కలిచి వేసింది. ఆస్తులు సగం సగం పంచుకున్నందున నెలకొకరు అవ్వకు ఇంత బువ్వ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువు ఒడిలో చేరిన ఆమె శవాన్ని కనీసం సొంత ఇంటిలోకి కూడా తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో హృదయ విదారకరంగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను విస్మయపరిచింది.

జగిత్యాల పట్టణంలోని సాదుల సత్తవ్వ (85) భర్త లక్ష్మణ్ 20 ఏళ్ల క్రితం మరణించాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో సత్తవ్వ తోటి కోడలు కొడుకులనే తన కొడుకులుగా భావించింది. తన ఆస్తులు కూడా వారిద్దరికి పంచి ఇచ్చింది. సొంత ఇంటితో పాటు పట్టణంలో ఉన్న భూమిని కూడా వారికి ముట్టజెప్పిన సత్తవ్వను వాయిదాల పద్దతిలో పెంపుడు కుమారులిద్దరూ నెలకొకరి చొప్పున చూసుకుంటున్నారు. అయితే ఇటీవలే అనారోగ్యం బారిన పడిన సత్తవ్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె మృతదేహాన్ని అంబూలెన్స్‌లో సొంత ఇంటికి తీసుకొచ్చినప్పటికీ ఇంటికి తాళం వేసి ఉండడంతో కొన్ని గంటల పాటు అలాగే ఉంచారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని ఇంటికి వేసిన తాళం పగలగొట్టించి సత్తవ్వ శవాన్ని లోపల ఉంచారు. అయితే ఓ పెంపుడు కొడుకు ఇంట్లో నెల రోజుల్లో వివాహం ఉన్న కారణంగా తన ఇంటికి తీసుకెళ్లలేకపోతున్నానని వివరించగా, మరో కొడుకు అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం స్థానికులను విస్మయపరిచింది. సత్తవ్వ ఆస్తి విషయంలో రాజీ పడకుండా వాటా తీసుకున్న పెంపుడు కొడుకు కనీసం ఆమెను చివరి చూపు చూసేందుకు కూడా రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న మహిళా ఎస్సై గీతారెడ్డి సత్తవ్వ పెంచుకున్న ఓ కుమారునికి ఫోన్ చేసినప్పటికీ ఆయన మాత్రం సత్తవ్వ మృతదేహం వద్దకు రావడానికి నిరాకరించాడు. పెంచుకున్న తల్లి చనిపోతే కూడా ఇలా వ్యవహరించడం ఏంటని ఎస్సై మందలించినా కూడా అతనిలో మార్పు రాలేదు. చనిపోయిన శవాన్ని ఇలా వదిలేసి వెళ్లడం సమంజసం కాదని, భవిష్యత్తు తరాలకు ఇచ్చే సందేశం ఇదేనా అని వ్యాఖ్యానించినప్పటికీ ఆయన మాత్రం స్పందించలేదు. సత్తవ్వ ఆస్తులను పంచుకుని ఆమెను పట్టించుకోకపోవడంపై ఆగ్రహించిన ఎస్సై ఆమె ఆస్థిని స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు సిఫార్సు చేస్తానని కూడా హెచ్చరించారు.

సత్తవ్వ ఆస్తిని పంచుకున్న పెంపకం బిడ్డలు ఇద్దరు ఉన్నప్పటికీ ఆమె అంత్యక్రియలు మాత్రం కుటుంబ సభ్యులు నిర్వహించకపోవడం విచిత్రం. ఓ కొడుకు ఇంట్లో వివాహం ఉందన్న కారణం, మరో కొడుకు అటుగా రాకపోవడంతో బయటి వ్యక్తుల ద్వారా అంతిమ సంస్కారం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. తన కడుపున పుట్టిన బిడ్డలు కాకున్నా.. తన కుటుంబానికి చెందిన వారే తన బిడ్డలుగా భావించిన సత్తవ్వ అంత్యక్రియలు చేసేందుకు కూడా ముందుకు రాకపోవడం పట్ల జగిత్యాల వాసులు విస్మయం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి