AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakes: పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా.! అలాంటప్పుడు మనం ఏం చేయాలి

పాము కాటు వేసే ముందు హెచ్చరిస్తుందా.? ఆ హెచ్చరికలను గుర్తించి పాముకాటు నుంచి ఎలా తప్పించుకోవచ్చో నిపుణులు వివరిస్తున్నారు. పాముల ప్రవర్తన, వాటికి దూరంగా ఉండాల్సిన ప్రదేశాలు.. లాంటివి ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఈ స్టోరీ పై లుక్కేయండి మరి.

Snakes: పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా.! అలాంటప్పుడు మనం ఏం చేయాలి
Snakes (A representative image)
Ravi Kiran
|

Updated on: Feb 11, 2026 | 6:34 PM

Share

పాములు అంటేనే చాలామందికి భయం. దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటారు. మరి అలాంటి పాము కాటు వేసే ముందు హెచ్చరిస్తుందా.? ఆ హెచ్చరికలు గుర్తించి పాముకాటు నుంచి తప్పించుకోవచ్చా.? పాము కాటుకు గురైతే ఏం చేయాలి, ఏం చేయకూడదు.? విషం అనేది పాములకు వేటాడే ఆయుధం. దానితోనే అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకే అవి విషాన్ని చాలా జాగ్రత్తగా వాడతాయి. తప్పించుకోవడానికి దారేదీ కనిపించని పరిస్థితుల్లోనే పాము మనిషిని కాటు వేస్తుంది. పాము ఎదురైనప్పుడు ఏమాత్రం భయం లేకుండా కదలకుండా ఉండిపోతే అది మీ నుంచి దూరంగా వెళ్లిపోతుందని స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేది వివరించారు.

దేశంలో పాముకాటు కేసులు వర్షాకాలంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. పాములు శీతాకాలం మొత్తం నిద్రావస్థలో ఉంటాయి. ఎండాకాలంలో బయటకు వచ్చి గుడ్లు పెడతాయి. వర్షాకాలంలో పిల్లలు పుడతాయి. ఈ సమయంలో ఆహారం కోసం పాములు చురుగ్గా వేటాడుతూ కప్పలు, ఎలుకలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. అందుకే వర్షాకాలంలో ఇవి ఎక్కువగా జనావాసాల్లోకి వస్తుంటాయని త్రివేది తెలిపారు. ఇళ్లలో వెలుతురు తక్కువగా ఉన్న గదుల్లోనే పాముకాటు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు గుర్తించారు. స్టోర్ రూంలు, కిచెన్లు, బెడ్‌రూంలు వంటి వెలుతురు తక్కువగా ఉన్న గదులు, వాటికి ఆహారం దొరికే ప్రదేశాల్లోకి ఇవి వెళ్తాయి. పాములు చీకటి ప్రదేశాల్లోనే దాక్కుంటాయి, వెలుగులో ఉండటానికి ఇష్టపడవని అన్నారు. దేశంలో ప్రధానంగా నాలుగు రకాల విషపూరిత పాములు ఉన్నాయి. కట్లపాము, నాగుపాము, రక్త పింజర, చిన్న రక్తపింజర ఈ లిస్టులో వస్తాయి.

కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కట్లపాము ఎప్పుడు కాటు వేస్తుందో చెప్పలేమని, మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ “బుస్ బుస్” అని శబ్దం చేస్తాయని త్రివేది చెప్పారు. కొన్ని పాములు శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్దం చేస్తుంటాయి. వాటి ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాముకాటు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నారు. కట్లపాము రాత్రివేళల్లో చురుగ్గా ఉండి, రాత్రంతా ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాముకాటు ప్రమాదాలు చోటుచేసుకుంటాయని ఆయన తెలిపారు.

చేయాల్సినవి, చేయకూడదనివి..

  • పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకూడదు.
  • సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలి.
  • పాముకాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది.
  • గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉండటమే మంచిది.
  • పాముకాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి.

పాముకాటు నివారణకు జాగ్రత్తలు:

పాములు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఉండే ప్రజలు పాముకాటుకు గురై చికిత్స తీసుకోవడం కన్నా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని పాముకాటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలని స్నేక్ క్యాచర్ చెబుతున్నారు.

  • ఇంటి బయట నిద్రించేవారు దోమతెరలను వాడాలి. ఇవి దోమలను నియంత్రించడమే కాదు, పాములు మీ దగ్గరకు రాకుండా కూడా ఉపయోగపడతాయి.
  • చీకటి ప్రదేశాలు, గదుల్లోకి వెళ్లేటప్పుడు చేతిలో ఫ్లాష్ లైటును తీసుకుని వెళ్లాలి. ఆ వెలుగులో చుట్టూ పరిసరాలను గమనించిన తర్వాతే ముందుకు వెళ్లాలి. మూలలు, చీకటిగా ఉన్న ప్రదేశాలను గమనించడం ముఖ్యం.
  • ఇలాంటి ప్రదేశాల్లో చేతులు పెట్టాల్సి వచ్చినప్పుడు చేతికి మందం ఉన్న వస్త్రాన్ని చుట్టుకోవాలి.
  • గార్డెన్, గడ్డి ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లేటప్పుడు పెద్ద గమ్ బూట్స్ వినియోగించాలి.
  • చేతుల్లో నుంచి ఏదైనా వస్తువు నేలపై పడితే వెంటనే నేలపై చేయి పెట్టకుండా కింద ఏముందో జాగ్రత్తగా పరిశీలించాలి.
  • ఈ జాగ్రత్తలు పాటించడానికి కొత్తగా ఖర్చు చేయాల్సిన పనేమీ లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పాముకాటు నుంచి తప్పించుకోవచ్చని న్నారు.