AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: బడ్జెట్ 4 కోట్లు.. ఒక్క రూపాయ్ రెమ్యునరేషన్ తీసుకోని రజినీ.. కట్ చేస్తే.. సౌత్ ఇండస్ట్రీ షేక్

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'నరసింహ' చిత్రం వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు మీకు తెలుసా.? రమ్యకృష్ణ నీలాంబరి పాత్రను ఎలా దక్కించుకుంది, అమితాబ్ బచ్చన్ ఈ సినిమా కోసం ఎందుకు చెన్నై వచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన రికార్డులేంటి.. ఆ వివరాలు ఇలా.

Rajinikanth: బడ్జెట్ 4 కోట్లు.. ఒక్క రూపాయ్ రెమ్యునరేషన్ తీసుకోని రజినీ.. కట్ చేస్తే.. సౌత్ ఇండస్ట్రీ షేక్
Rajinikanth
Ravi Kiran
|

Updated on: May 04, 2026 | 8:22 PM

Share

దక్షిణాది ఇండస్ట్రీలో ‘బాషా’ చిత్రం సృష్టించిన ప్రభంజనం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.ఆయన స్టార్ పవర్‌కు సరితూగే కథలను సిద్ధం చేయడం రచయితలకు పెద్ద సవాలుగా మారడంతో, రజనీకాంత్ స్వయంగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకుని కథా చర్చలు జరపడం ప్రారంభించారు. ‘ముత్తు’ సినిమాతో జపాన్‌లో సైతం విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న ఆయన, ఆ చిత్ర దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌కు మరో అవకాశం ఇచ్చారు. రజనీకాంత్ టీమ్ ‘పొన్నియిన్ సెల్వన్’ నవలలోని ప్రాథమిక అంశాలను తీసుకుని ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసింది. రామాయణంలో హనుమంతుడు తన తోకతో కుర్చీని ఏర్పాటు చేసుకుని కూర్చునే ఘట్టం నుంచి స్ఫూర్తి పొంది, సినిమాలో రజనీకాంత్ రమ్యకృష్ణ ముందు స్టైల్‌గా కూర్చునే ఐకానిక్ సీన్‌ను రూపొందించారు.

1998 సెప్టెంబర్‌లో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. తొలుత ఈ సినిమాకు ‘నీలాంబరి’ అనే టైటిల్‌ను పరిశీలించినప్పటికీ, నెగటివ్ టచ్ ఉంటుందని అభిమానులు భావిస్తారనే భయంతో ‘పడయప్ప'(తెలుగులో నరసింహ)గా ఖరారు చేశారు. ఈ చిత్రంలో నీలాంబరి పాత్ర కోసం ఐశ్వర్యారాయ్, మీనా లాంటి 15 మంది హీరోయిన్లను సంప్రదించగా, సూపర్ స్టార్‌ను ఎదిరించే పాత్ర చేయలేమని వారు సున్నితంగా తిరస్కరించారు. కానీ రమ్యకృష్ణ దీనిని ఒక సవాలుగా తీసుకుని అంగీకరించారు. రజనీకాంత్ తండ్రి పాత్రలో నట దిగ్గజం శివాజీ గణేషన్ నటించడం విశేషం. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం కేవలం 90 పనిదినాల్లో, 4 కోట్ల బడ్జెట్‌తో పూర్తయింది. రజనీకాంత్ ఈ సినిమాకు పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోవడం గమనార్హం.

మొదట మూడున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాను చూసిన కమల్ హాసన్, కొన్ని మార్పులు సూచించడంతో ఎడిటింగ్ చేసి నిడివి తగ్గించారు. 1999 ఏప్రిల్ 10న విడుదలైన ‘నరసింహ’ మొదటి రోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించుకుంది. “నా దారి రహదారి” వంటి పవర్‌ఫుల్ డైలాగులు, రజనీకాంత్ మేనరిజమ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. నీలాంబరిగా రమ్యకృష్ణ నటన సినిమాకే హైలైట్‌గా నిలిచి ఆమెకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా క్రేజ్ ఎంతలా ఉందంటే, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మొదటి రోజే సినిమా చూడటానికి ప్రత్యేకంగా చెన్నైకి రావడం అప్పట్లో ఒక సంచలనం. ఒక పరభాషా చిత్రం కోసం అమితాబ్ మరో నగరానికి వెళ్లడం అదే మొదటిసారి.

బాక్సాఫీస్ వద్ద ‘నరసింహ’ రికార్డుల సునామీ సృష్టించింది. ఐదు తమిళనాడు స్టేట్ అవార్డులను గెలుచుకోవడమే కాకుండా, దక్షిణాది అంతటా భారీ వసూళ్లు సాధించింది. కేవలం తమిళ వెర్షన్ 35 కోట్ల గ్రాస్ వసూలు చేసి అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగులో కూడా డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త చరిత్రను లిఖించింది. దాదాపు 7 కోట్ల షేర్ వసూలు చేయడంతో పాటు, అనేక కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై రికార్డులు నెలకొల్పింది. ఓవర్సీస్‌లోనూ 2.2 మిలియన్ డాలర్లు వసూలు చేసి రజనీకాంత్ గ్లోబల్ స్టార్‌డమ్‌ను మరోసారి చాటిచెప్పింది.

Also Read:

వాడి ఊరు పేరు తెలియదు.. రూ. 35 వేలు సాయం చేశానని కిడ్నీ ఇవ్వడానికి వచ్చేశాడు.. 

150కిపైగా సినిమాల్లో హీరోయిన్.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక అనాధలా..

Follow Us