Munugode Bypoll: ఎమ్మెల్మేలపై ఎర విషయంలో అడుగులు ముందుకు.. సోమవారం విచారణకు ఆ నలుగురు..

మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. కానీ ఆ ఉప ఎన్నిక కారణంగా తెరమీదకి వచ్చిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు ఇంకా తెమలలేదు. ఈ కేసులో ఏం జరగబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ..

Munugode Bypoll: ఎమ్మెల్మేలపై ఎర విషయంలో అడుగులు ముందుకు.. సోమవారం విచారణకు ఆ నలుగురు..
Mla Purchasing Issue
Follow us

|

Updated on: Nov 21, 2022 | 7:42 AM

తెలంగాణ మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. కానీ ఆ ఉప ఎన్నిక కారణంగా తెరమీదకి వచ్చిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు ఇంకా తెమలలేదు. ఈ కేసులో ఏం జరగబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రాష్ట్ర, కేంద్ర అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయ రగడ పెట్టిన ఈ కేసులో అనేక పరిణామాలు కలగజేసుకునే వాతావరణం కనిపిస్తోంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ సహా నలుగురు కీలక వ్యక్తులు సోమవారం విచారణకు హాజరు కావాలని సిట్‌(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయవర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సంతోష్‌, కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్యుడు డా.జగ్గుస్వామి, భారత్‌ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్‌ వెల్లాపల్లి, కరీంనగర్‌ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌ విచారణకు రావాల్సి ఉంటుంది. ఇవి సీఆర్పీసీ 41ఏ నోటీసులు కావడంతో ఆ నలుగురు వ్యక్తిగతంగానే దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరి వాంగ్మూలాల నమోదే.. తదుపరి దర్యాప్తులో కీలకం కాబోతుంది. విచారణలో కొత్త విషయాలేమైనా వెలుగులోకి వస్తాయా..? రావా..? ఆనేది అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తున్న ప్రశ్నలు. అనారోగ్యం, ఇతరత్రా ముందస్తు కార్యక్రమాలుంటే తప్ప నలుగురూ కచ్చితంగా సిట్‌ విచారణకు సోమవారమే హాజరు కావాలి. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా ప్రధాననేత అయిన బీఎల్‌ సంతోష్‌ విచారణకు రావాల్సి ఉండటం రాజకీయ వాతావారణాన్ని వేడెక్కించే అంశం. ఆ నలుగురూ చట్టపరమైన రక్షణ అవకాశాలను, న్యాయపరమైన సాంకేతికాంశాలను వినియోగించుకోవచ్చని కొందరు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. నిందితులు విచారణకు సహకరించాలని.. పోలీసులు వారిని అరెస్టు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే నిర్దేశించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 29 లోపు కేసు దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించాల్సి ఉన్నందున కీలక ఆధారాలు సేకరించే పనిలో సిట్‌ మునిగిపోయింది.

అన్నీ సిద్ధం..

ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిని భాజపాలో చేరాలంటూ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో అక్టోబర్ 26న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సిట్ విచారించిన క్రమంలో పలువురి పేర్లు బయటకు వచ్చాయి. దాని ఆధారంగానే నలుగురికీ నోటీసులు జారీ చేశారు. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలోని సిట్‌ కార్యాలయానికి సోమవారం వీరిని విచారణకు పిలవడంతో.. వారిని ఏయే ప్రశ్నలను అడగాలనే దానిపై పలు ప్రశ్నలను సిట్‌ ఈ పాటికే తయారుచేసుకుంది. నలుగురినీ వ్యక్తిగతంగా ప్రశ్నించేందుకు సిట్ సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి

లోతుగా ఆరా..

  • * మునుగోడు ఉప ఎన్నికకు ముందు.. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో మంతనాలు సాగించిన రోజు రామచంద్రభారతి తన ఫోన్‌ నుంచి తుషార్, పైలట్‌ రోహిత్‌రెడ్డితో ఎమ్మెల్యేలను మాట్లాడించారు. ఈ నేపథ్యంలో వారిని ప్రలోభపెట్టే విషయంలో తుషార్‌కు గల సంబంధంపై సిట్ అధికారులు విచారించబోతున్నారు.
  • రామచంద్రభారతి ఫోన్‌ నుంచి ‘సంతోష్‌ బీజేపీ’ అనే పేరుతో ఉన్న కాంటాక్టుకు మెసేజ్‌లున్నాయి. వాటిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన సమాచారం ఉండటం ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే సంతోష్‌ తిరిగి సమాధానం ఇచ్చినట్లు ఎక్కడా లేదు. వీటి గురించి సంతోష్‌ను సిట్ అధికారులు ఆరా తీయనున్నారు.
  • సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు న్యాయవాది శ్రీనివాస్‌ విమాన టికెట్‌ బుక్‌ చేసినట్లు కూడా పలు ఆరోపణలున్నాయి. ఆయనకు టికెట్‌ బుక్‌ చేయాల్సిన అవసరమేముంది? ఆయనతో సంబంధమేంటి..? అనే కోణంలో శ్రీనివాస్‌ను విచారించనున్నారు.
  • రామచంద్ర భారతికి తుషార్‌ను పరిచయం చేసింది డా.జగ్గుస్వామి అని పలువురు చెబుతున్నారు. తుషార్‌, జగ్గుస్వామి ఇద్దరూ కేరళవాసులే కావడంతో ఈ వ్యవహారంలో వీరి ప్రమేయం ఎంత అనేదానిపై  కూడా విచారించనున్నారు.
  • రామచంద్రభారతి మాటలలో నంబర్‌ 1, నంబర్‌ 2 అంటూ ప్రస్తావన ఉంది. వారెవరనే స్పష్టత కోసం కూడా సిట్ ప్రయత్నిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..