KCR: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు.. ఆ రోజు అందుబాటులో ఉండాలన్న అధికారులు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో సిట్ తెలిపింది. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ సాధ్యం కాదని సిట్ స్పష్టం చేసింది.

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. గతంలో నోటీసులు ఇచ్చిన సమయంలో కేసీఆర్ కొన్ని అభ్యర్థనలను సిట్ ముందు ఉంచారు. మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాతే విచారణకు వస్తానని, అలాగే విచారణను తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరపాలని ఆయన కోరారు. అయితే సిట్ అధికారులు ఈ రెండు ప్రతిపాదనలను తిరస్కరించారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ సాధ్యం కాదని తేల్చి చెప్పిన అధికారులు, నందినగర్ నివాసంలోనే విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
ఇప్పటికే కీలక నేతల విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలను విచారించింద. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావులను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారం, నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సిట్ తాజా నోటీసులపై కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. సిట్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న ఆయన విచారణకు సహకరిస్తారా..? లేదా మరోసారి గడువు కోరుతూ లేఖ రాస్తారా? చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తారా? అన్నది వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
