Telangana: ఆ గ్రామంలో అడుగుపెట్టాలంటేనే వణికిపోతున్న మందుబాబులు.. ఎందుకో తెలుసా?
మద్యం మహమ్మారిపై సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది.. ఊరిలో మందు అమ్మినా.. కొన్నా ఏకంగా 5 లక్షల రూపాయల భారీ జరిమానా విధిస్తూ గ్రామసభ సంచలన తీర్మానం చేసింది. ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచేందుకు, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఆ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందర్నీ ఆలోచింప చేస్తుంది.

కుటుంబాలను చిన్నాబిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని తమ జీవితాల్లోంచి తరిమికొట్టేందుకు సిద్ధిపేట జిల్లాలోని ఓ గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ గ్రామంలో మద్యం అమ్మినా, కొన్నా రూ.5లక్షల జరిమానా విధిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మక్త మాసాన్ పల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా మద్యం చిచ్చు రేపుతోంది. దీని వల్ల పచ్చని కాపురాలు నాశనం అవుతున్నాయి. కష్టపడిన డబ్బంతా మద్యం దుఖానాల పాలు చేస్తూ రోజూ తాగి వచ్చి ఇంట్లోని ఆడవాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం పెరిగిపోయింది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలని మక్త మాసాన్ పల్లి గ్రామస్తులు గట్టిగా నిశ్చయించుకున్నారు.
ముఖ్యంగా గ్రామంలోని యువత మద్యానికి బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటుండటం ఊరి పెద్దలను కలచివేసింది. రాత్రి వేళల్లో తాగి గొడవలకు దిగడం నిత్యకృత్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే గ్రామ మహిళా సంఘాలు,యువకులు, పెద్దలు అంతా కలిసి ఒకే వేదికపైకి వచ్చారు.గ్రామసభను ఏర్పాటు చేసి.. ఊరిలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ గ్రామసభలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించినా.. లేదా కొనుగోలు చేసినా వారికి ఏకంగా రూ. 5 లక్షల భారీ జరిమానా విధించాలని నిర్ణయించారు. కేవలం చట్టాలు, పోలీసులపైనే ఆధారపడకుండా.. ఊరి బాగు కోసం వారే స్వయంగా ఈ కఠిన నిబంధనను తెచ్చుకున్నారు. ఈ నిర్ణయానికి ఊరిలోని ప్రతి ఒక్కరూ పూర్తి మద్దతు ప్రకటించారు.మక్త మాసాన్ పల్లిని ఆదర్శ మద్యరహిత గ్రామంగా మార్చేందుకు అందరూ సహకరించాలని గ్రామస్తులు పిలుపునిస్తున్నారు.
మద్యం మహమ్మారిని తరిమికొట్టేందుకు మక్తమాసాన్ పల్లి గ్రామస్తులు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం..చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. మరి ఈ జరిమానా నిబంధనతో గ్రామం పూర్తిగా మద్యరహితంగా మారుతుందో లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
