TV9 Effect: ఆకులు రాలని కారడవిలో బాంబుల అలజడి.. నెత్తురొలికే దారుల్లో సాహసోపేత ఆపరేషన్..!
ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో టీవీ9 ప్రసారం చేసిన కథనాలు నిజమే అని మరోసారి రుజువైంది. మందుపాతరలతో ఆదివాసీలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని రిపోర్టర్స్ స్పెషల్ పేరుతో ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కర్రెగుట్ట చుట్టూ బాంబులు ఉన్న మాట నిజమే అని ఒప్పుకున్నారు.

కర్రెగుట్ట ఏ మాత్రం సురక్షితం కాదు. ఈ మాట మావోయిస్టులే ఒప్పుకుంటున్నారు. అటు వైపు వెళ్లొద్దని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఆ పరిసర గ్రామాల ప్రజలు కర్రెగుట్ట వైపు వెళ్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆ గుట్ట పేరు ఎత్తితేనే ఆదివాసీలు వణికిపోతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో టీవీ9 ప్రసారం చేసిన కథనాలు నిజమే అని మరోసారి రుజువైంది. మందుపాతరలతో ఆదివాసీలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని రిపోర్టర్స్ స్పెషల్ పేరుతో ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కర్రెగుట్ట చుట్టూ బాంబులు ఉన్న మాట నిజమే అని ఒప్పుకున్నారు.
రెండురాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులకు కంచుకోట.. అలాంటి కర్రెగుట్టపై కాలు పెట్టాలంటే గట్స్ ఉండాలి. అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రాణం మీద ఆశ వదులుకోవాలి. ప్రతీ అడుగు ప్రాణసంకటమే. ఎందుకంటే ల్యాండ్స్ మైన్స్‌తో నిండిన కర్రెగుట్టపై టీవీ9 సాహసోపేతమైన రిపోర్టింగ్‌కు వెళ్లింది. మావోయిస్టుల ల్యాండ్ మైన్స్ మిగిల్చిన రక్తపు మరకలు, భద్రత బలగాల ఆపరేషన్‌ను మీ ముందుచే యత్నం చేసింది. అసలు కర్రెగుట్ట ఎందుకు మావోయిస్టులకు కేంద్రంగా మారింది.? పెద్దసంఖ్యలో మందుపాతరలను ఎందుకు అమర్చారు? ఆ మందుపాతరలకు అమాయక ప్రజలు బలి అవుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదు.?
కర్రెగుట్టపై రిపోర్టింగ్ అంటే.. ముందు చూపు కాదు మందుపాతరలపై చూపుండాలి. లేదంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఏ మందుపాతరపై కాలు వేస్తామో తెలియదు.. ఎటు నుంచి మావోయిస్టులు అటాక్ చేస్తారో తెలియదు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కర్రెగుట్టలో ఏం జరుగుతుందో మీ ముందుంచే ప్రయత్నం చేసింది టీవీ9.
ఎన్నో ఏళ్లుగా మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్ట.. ఇప్పుడు అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకునే డెత్ స్పాట్‌గా మారింది. మావోయిస్టుల ఆత్మరక్షణ చర్యలు, అడవితల్లితో ముడిపడిన వారి జీవనాన్ని నరకంలోకి నెట్టేస్తోంది. భద్రత బలగాల నుంచి ఆత్మరక్షణ కోసం గుట్టను రక్షణ కవచంలా ఏర్పాటుచేసుకున్న IED బాంబులు ఆదివాసీల ఆయువును తీస్తున్నాయి. అలాంటి గుట్టపైకి వెళ్లడం అంటే చావుకు ఎదురువెళ్లడమే అయినా.. గిరిజనుల కష్టాలను తెలిసే యత్నం చేసింది టీవీ9.
ఒకరిది పై చేయి కోసం ఆరాటం.. మరొకరిది ఉనికి కోసం పోరాటం.. ఈ అంతర్యుద్దంలో చివరకు అమాయక జనమే మృత్యుఒడికి చేరుతున్నారు. ఇటీవల కాలంలో కర్రెగుట్టపై జరిగిన సంఘటనలు.. వెన్నులో వణుకుపుట్టించేలా చేస్తున్నాయి. గుట్ట చుట్టూ అమర్చిన ల్యాండ్ మైన్స్, IEDలు.. ప్రజల పాలిట శాపంగా మారాయి. నిత్యం అడవిపై ఆధారపడి జీవించే ఆదివాసీలు.. వంటచెరుకు, ఇతర పనుల కోసం అడవిలోకి వెళ్తుంటారు. అలా వెళ్లిన వారిలో11 మంది బాంబుల బారిన పడ్డారు. కొందరు మృత్యువాత పడగా.. మరికొందరు కాళ్లు చేతులను పోగొట్టుకున్నారు.
మావోయిస్టులు, పోలీసుల ఆధిపత్య పోరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అభయారణ్యం అట్టుడుకుతోంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ మిషన్ 2026 దిశగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్న క్రమంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. మొన్నటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడవులు.. ఆపరేషన్ కగార్‌తో కల్లోలంగా మారింది.
అక్కడ అలా ఉంటే.. ఇక్కడి కర్రెగుట్ట పోలీసులకు సవాల్ విసురుతోంది. ఈ గుట్టను సేఫ్ జోన్‌గా ఎంచుకున్న మావోయిస్టులు వందల సంఖ్యలో ల్యాండ్ మైన్స్ అమర్చారు. ఎవరూ ఈ గుట్టపైకి రావొద్దంటూ ఓ లేఖను విడుదల చేశారు. మావోయిస్టుల లేఖ నేపథ్యంలో పోలీసులు కర్రెగుట్టపై సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పదుల సంఖ్యలో బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. పోలీసుల ఆంక్షల మధ్య వారితో కొద్దిదూరం వెరకు వెళ్లిన టీవీ9 అక్కడి వాస్తవ దృశ్యాలను మీ ముందుంచే యత్నం చేసింది.
కర్రెగుట్ట చుట్టూ పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలున్నాయి. ఇక్కడి వారికి ఈ గుట్టే ఆధారం. అటవీ ఉత్పత్తులు, వంట చెరుకు కోసం నిత్యం అడవిపైనే ఆధారపడుతుంటారు. ప్రతీరోజూ అడవిలోకి వెళ్లి వస్తుంటారు. ఆ క్రమంలో ఇటీవల కొందరు చూడకుండా బాంబులపై కాలు వేయడంతో మృత్యువాత పడగా, మరికొందరు జీవశ్చవాలుగా మారారు. మందుపాతరల నిర్వీర్యం, బూబిట్రాప్‌ల గుర్తింపుతో అడవిలో అలజడి నెలకొంది. పట్టు కోల్పోతున్న మావోయిస్టులు కర్రెగుట్టలో మందుపాతలను అమర్చడంతో CRPF, స్పెషల్ పార్టీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ టీమ్స్, మైన్స్ డిటెక్టర్లతో IEDలను వెలికితీస్తున్నారు. ప్రతీ అడుగులో పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి తొలగిస్తున్నారు. కర్రెగుట్ట సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా పోలీసుల వెంట వెళ్లిన టీవీ9.. మార్గమధ్యలో వెంట తీసుకెళ్లిన ఆహారాన్ని తిన్నాక, కాసేపు విశ్రాంతి తీసుకుంది. తర్వాత పోలీసుల డైరెక్షన్‌లో ముందుకు సాగింది. ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో మందుపాతలను వెలికితీశారు. అవి పేలి ఉంటే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేదన్నది పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఓవైపు మావోయిస్టుల కోసం గాలింపు చేపడుతూనే, మరోవైపు మందుపాతలను నిర్వీర్యం చేస్తున్నారు. ఛత్తీస్గడ్, తెలంగాణ బార్డర్‌లో ఉన్న కర్రెగుట్టను జల్లెడ పడుతున్నారు. వెంట వెళ్లిన మమ్మల్ని పోలీసులు కొంత దూరం వరకే అనుమతించారు. ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉన్నందున లోపలికి రావద్దని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ దండకారణ్యం మావోయిస్టులకు ఆయువుపట్టు. అక్కడ వారిని ఏరివేసేందుకు.. ఆపరేషన్ కగార్‌తో నిఘాను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉన్న కర్రెగుట్టను మావోయిస్టులు సేఫ్‌జోన్‌గా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ములుగు జిల్లా పోలీసులు కీకారణ్యం కర్రెగుట్టలో కూంబింగ్‌ను పెంచారు.
కర్రెగుట్టకు సమీపంలోనే బీజాపూర్ జిల్లాలో బెడెం మల్లన్న స్వామి ఆలయం ఉంటుంది. అక్కడికి గిరిజనులు ప్రతీ ఏటా వెళ్తుంటారు. అడవిలో దాదాపు 40 కిలోమీటర్లు కాలినడకన వెళితే కానీ ఆలయానికి చేరుకోరు. ఆ క్రమంలోనే ఇటీవల వీఆర్‌కే పురానికి చెందిన గ్రామస్తులు… అక్కడికి వెళ్తుండగా మందుపాతర పేలడంతో సునిత అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆ ఘటనలో ఆమె తన కాలును కోల్పోవాల్సి వచ్చింది. వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్లిన ఇల్లందుల ఏసు అనే వ్యక్తి కూడా మందుపాతరకు బలయ్యాడు. ఆదివాసీల హక్కుల కోసమే తాము పనిచేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టులు.. పోతున్న ప్రజల ప్రాణాలకు ఏం సమాధానం చెబుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో ఘటనలో నవీన్ అనే ఆదివాసీ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అడవిలోకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. బాంబుపై కాలు వేయడంతో పేలిపోయింది. ప్రాణాలతో బయటపడ్డప్పటికీ.. పూర్తిస్థాయిలో కోలుకోలేదు. గుట్టపై ప్రెషర్ బాంబులు పేలిన ప్రతీసారీ వారిని రక్షించేందుకు 108 సిబ్బంది అక్కడకు చేరుకుంటారు. గుట్టపై నుంచి జోలె కట్టి తీసుకువస్తుంటారు. ఇలా మనుషులే కాదు, వన్యప్రాణులు కూడా మృత్యువాత పడుతున్న సందర్భాలున్నాయి. వరుస ఘటనలతో కర్రెగుట్ట వైపు వెళ్లాలంటేనే గిరిజనులు వణికిపోతున్నారు.
పచ్చని అడవి హాయిగా ఊపిరి పీల్చుకుని చాలా ఏళ్లవుతోంది. గుండెలోతుల్లో మందుపాతరలు భరిస్తున్న జనం.. క్షణక్షణం వణికిపోతున్నారు. ఇలాంటి కర్రెగుట్టలో నెలకొన్న గుండెగోసను బాహ్య ప్రపంచానికి చూపించడానికి టీవీ9 చేపట్టిన సాహసోపేతమైన ఈ ప్రయత్నాన్ని ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. సమస్య మూలాల్లోకి వెళ్లి వాస్తవాలను చూపించడాన్ని ప్రశంసిస్తున్నారు. ఓవైపు మందుపాతరలు, మరోవైపు ఇన్ఫార్మర్ల పేరుతో హత్యలు. ఇలా రెండు విధాలుగా సామాన్యులే సమిధలుగా మారుతున్నారు. ఇలాటి దుశ్చర్యలను ఆపేయాలంటూ ఇటీవల గ్రామాల్లో ఆదివాసీ గిరిజనులు ఆందోళనలకు దిగుతుండటం మావోయిస్టులపై పెరుగుతున్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. వరుస ఘటనల నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడుతున్నాయి. మందుపాతరలతో ప్రజల ప్రాణాలు తీయొద్దంటూ నిరసనలకు దిగుతున్నారు. రోడ్డుపైకి వచ్చి మావోయిస్టుల తీరును తప్పుడుతున్నారు.
మావోయిస్టుల ఏరివేత పేరుతో 1996 నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో సుమారు 14వేలకుపైగా చనిపోగా, అందులో 5వేలకుపైగా మావోయిస్టులు ఉండగా.. 3వేల మంది పోలీసులున్నారు. మిగిలిన 6వేల మంది సామాన్య పౌరులే అన్నది నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రకారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎక్కువగా నలిగిపోతున్నది ప్రజలే అని అర్థమవుతోంది. భద్రతా దళాలు తమ వద్దకు చేరుకోకుండా ఉండేందుకు మావోయిస్టులు.. ట్యాక్టిక్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్‌ను అమలు చేస్తుండగా… కౌంటర్ వ్యూహంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. ఇంద్రావతి నది గోదావరిలో నలిసే చోటు నుంచి ప్రారంభమయ్యే కర్రెగుట్టలు.. తాలిపేరు వాగు గోదావరిలో కలిసే వరకు ఉంటుంది. అంటే ఇంచుమించు 100 కిలోమీటర్ల పొడువుతో వ్యాపించి ఉంటాయి. ఈ గుట్టల మధ్య పుష్కలమైన జలవనరులున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు షెల్టర్‌గా ఏర్పాటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..